Appadam Mixture : అప్పడం మిక్చర్.. మనం ఇంట్లో సులభంగా చేసుకోదగిన చిరుతిళ్లల్లో ఇది కూడా ఒకటి. అప్పడం మిక్చర్ చాలా రుచిగా ఉంటుంది. చాలా తక్కువ సమయంలో, చాలా సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. తరచూ ఒకేరకం స్నాక్స్ కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఇంట్లో అందరూ దీనిని ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ అప్పడం మిక్చర్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అప్పడం మిక్చర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, అటుకులు – ఒక కప్పు, పల్లీలు – పావు కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన టమాట – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత, బ్లాక్ సాల్ట్ – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, చాట్ మసాలా – అర టీ స్పూన్, పసుపు – చిటికెడు, నిమ్మరసం – అర చెక్క.
అప్పడం మిక్చర్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక అటుకులను వేసి వేయించాలి. అటుకులు బాగా పొంగి వేగిన తరువాత గిన్నె లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో పల్లీలను కూడా వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలతో పాటు మిగిలిన పదార్థాలన్నీ కూడా వేసి కలపాలి. తరువాత పెద్దగా ఉండే మసాలా అప్పడాన్ని తీసుకుని రెండు ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ముక్కను తీసుకుంటూ పెనం మీద వేసి రెండు వైపులా పచ్చిదనం పోయే వరకు కాల్చుకోవాలి.
ఇలా కాల్చుకున్న వెంటనే అప్పడాన్ని తీసి కోన్ లాగా చుట్టుకోవాలి. తరువాత ఇందులో అటుకుల మిక్చర్ ను ఉంచి సర్వ్ చేసుకోవాలి. దీనిని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవడం వల్ల అప్పడం మెత్తబడకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అప్పడం మిక్చర్ తయారవుతుంది. స్నాక్స్ గా తినడానికి ఇది చాలాచక్కగా ఉంటుంది. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.