Appam Egg Curry : మనం కోడిగుడ్లతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. కోడిగుడ్లతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే కోడిగుడ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో అప్పం ఎగ్ కర్రీ కూడా ఒకటి. తక్కువ కోడిగుడ్లతో ఎక్కువ కూరను తయారు చేసుకోవాలంటే ఈ కూరనే తయారు చేసుకోవాలి. అలాగే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎంతో రుచిగా ఉండే అప్పం ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అప్పం ఎగ్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 4, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత,ధనియాల పొడి -ఒక టీ స్పూన్, చికెన్ మసాలా – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – 2 టీ స్పూన్స్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయలు – 3, తరిగిన పచ్చిమిర్చి – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన పెద్ద టమాట – 1, ఉప్పు – తగినంత, కారం – ఒకటిన్నర టీ స్పూన్, ధనియాల పొడి -ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, చికెన్ మసాలా – అర టీ స్పూన్, నీళ్లు – ఒకటిన్నర గ్లాస్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
అప్పం ఎగ్ కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో కోడిగుడ్లను తీసుకోవాలి. తరువాత వీటిని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత స్టవ్ మీద పొంగనాల గిన్నెను ఉంచి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ముందుగా సిద్దం చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని పొంగనాల లాగా వేసుకోవాలి. తరువాత వీటిపై మూతను ఉంచి చిన్న మంటపై కాల్చుకోవాలి. ఈ ఎగ్ పొంగనాలు ఒక వైపు వేగిన తరువాత మరో వైపుకు తిప్పుకోవాలి. వీటిని మరో అర నిమిషం పాటు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో శనగపిండి వేసి వేయించాలి. దీనిని కొద్దిగా రంగు మారే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారిన తరువాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత టమాట ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, పసుపు వేసి కలపాలి. తరువాత శనగపిండి వేసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న ఎగ్ పొంగనాలను వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అప్పం ఎగ్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం,చపాతీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.