Atukula Murukulu : మనం అటుకులతో రకరకాల చిరుతిళ్లను తయారు చేసుకుని తింటూ ఉంటాము. అటుకులతో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా తక్కువ సమయంలో వీటిని తయారు చేసుకోవచ్చు. అయితే తరుచూ ఒకేరకం చిరుతిళ్లు కాకుండా అటుకులతో మనం ఎంతో రుచిగా ఉండే మురుకులను కూడా తయారు చేసుకోవచ్చు. అటుకుల మురుకులు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ అటుకుల మురుకులను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అటుకుల మురుకుల తయారీకి కావల్సిన పదార్థాలు..
అటుకులు – అర కప్పు, పుట్నాల పప్పు – పావు కప్పు, బియ్యంపిండి – ఒక కప్పు, జీలకర్ర – అర టీ స్పూన్, నువ్వులు – అర టీ స్పూన్, కళోంజి సీడ్స్ – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – పావు టీ స్పూన్, ఉప్పు లేని బటర్ – 2 టేబుల్ స్పూన్స్, వేడి నీళ్లు – ఒక కప్పు లేదా తగినన్ని, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
అటుకుల మురుకుల తయారీ విధానం..
ముందుగా కళాయిలో అటుకులు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత పుట్నాల పప్పు వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తని పొడిగా చేసుకోవాలి. తరువాత ఈ పొడిని జల్లించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో బియ్యంపిండి, జీలకర్ర, నువ్వులు, కళోంజి విత్తనాలు, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. తరువాత బటర్ వేసి కలపాలి. తరువాత నీళ్లు పోస్తూ పూరీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టాన్ని తీసుకుని దానికి నూనె రాసుకోవాలి. తరువాత ఇందులో పిండిని ఉంచాలి.
తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మురుకులను వత్తుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత చివరగా కరివేపాకు వేసి వేయించి మురుకుల్లో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే అటుకుల మురుకులు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన అటుకుల మురుకులను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.