Atukula Sweet : అటుకులతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పోహ, మిక్చర్ తో పాటు తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. అటుకులతో చేసే తీపి వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. అందులో భాగంగా అటుకులతో కింద చెప్పిన రుచికరమైన స్వీట్ ను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అటుకుల స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కొబ్బరి పాలు -3 కప్పులు, పెద్ద అటుకులు – ఒక కప్పు, బెల్లం తురుము – 2 కప్పులు, నీళ్లు – ముప్పావు కప్పు, యాలకుల పొడి – ఒక టీ స్పూన్.
అటుకుల స్వీట్ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో అటుకులను తీసుకుని పొడిగా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో కొబ్బరి పాలను తీసుకోవాలి. ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న అటుకుల పొడిని వేసి కలపాలి. అటుకులు నాని ఈ మిశ్రమం చక్కగా దగ్గర పడుతుంది. తరువాత కళాయిలో బెల్లం, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత దీనిని మరో నిమిషం పాటు బాగా ఉడికించాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న అటుకుల మిశ్రమం వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని కొబ్బరి పాలల్లో ఉండే నూనె పైకి తేలే వరకు బాగా కలుపుతూ ఉడికించాలి.
ఈ మిశ్రమం దగ్గర పడి నూనె పైకి తేలిన తరువాత యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత పైన సమానంగా చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత దీనిని గిన్నె నుండి వేరు చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మనకు కావల్సిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అటుకుల స్వీట్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అటుకులతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా స్వీట్ ను కూడా తయారు చేసుకుని తినవచ్చు.