Baby Corn Manchurian : బేబీ కార్న్ గురించి అందరికీ తెలుసు. చిన్న సైజు మొక్క జొన్న కంకులు ఇవి. వీటిని రెస్టారెంట్లలో అనేక వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది ఇంట్లోనూ బేబీ కార్న్‌తో పలు రకాల వంటకాలను తయారు చేసి తింటున్నారు. ఈ క్రమంలోనే బేబీ కార్న్‌తో మనం అనేక స్నాక్స్‌ను కూడా చేయవచ్చు. వాటిల్లో బేబీ కార్న్ మంచూరియా కూడా ఒకటి. కాస్త శ్రమించాలే కానీ రెస్టారెంట్ స్టైల్‌లో మనం దీన్ని చేయవచ్చు. ఇక దీని తయారీకి ఏమేం పదార్థాలు కావాలో, దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బేబీ కార్న్ మంచూరియా తయారీకి కావల్సిన పదార్థాలు..
బేబీ కార్న్‌లు – 12, మైదా పిండి – 3 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ – 1, ఉల్లికాడల తరుగు – 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్లు, కారం – 1 టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, చిల్లీ సాస్ – 1 టీస్పూన్, సోయా సాస్, టమాటా సాస్ – 2 టీస్పూన్ల చొప్పున, నూనె – వేయించడానికి సరిపడా, వెల్లుల్లి తరుగు – అర టీస్పూన్.
బేబీ కార్న్ మంచూరియా తయారీ విధానం..
ఒక గిన్నెలో బేబీ కార్న్‌లు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా, కార్న్ ఫ్లోర్ వేసి సరిపడా నీళ్లు పోసి బాగా కలపాలి. తరువాత బేబీ కార్న్‌లను నూనెలో పకోడీల మాదిరిగా వేసి దోరగా వేయించాలి. ఆ తరువాత ఒక ఫ్రైయింగ్ పాన్‌లో అర టేబుల్ స్పూన్ నూనె వేసి పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి తరుగులను వేయించాలి. తరువాత చిల్లీ సాస్, సోయా సాస్, టమాటా సాస్, కొద్దిగా ఉప్పు కూడా వేసి 2 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తరువాత బేబీ కార్న్, ఉల్లికాడల తరుగు కూడా వేసి బాగా కలిపి దించేయాలి.