Banana Chips : పచ్చి అరటి కాయలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పండిన అరటికాయల వలె ఇవి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పచ్చి అరిటికాయలతో మనం చేసుకోదగిన వాటిల్లో చిప్స్ కూడా ఒకటి. అరటి కాయ చిప్స్ ను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. స్నాక్స్ గా తినడానికి ఈ చిప్స్ చాలా చక్కగా ఉంటాయి. ఈ అరటికాయ చిప్స్ ను కూడా మనం ఇంట్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా తేలిక. రుచిగా, కరకరలాడుతూ ఉండేలా అరటికాయ చిప్స్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బనానా చిప్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి నేంద్రన్ అరటికాయలు – 2, పసుపు – ఒక టీ స్పూన్, ఉప్పు – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – పావు కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
బనానా చిప్స్ తయారీ విధానం..
ముందుగా అరటికాయలపై ఉండే చెక్కును తీసి వాటిని నీటిలో వేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, నీళ్లు పోసి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మంటను చిన్నగా చేయాలి. తరువాత అరటికాయలను తీసుకుని చిప్స్ నేరుగా నూనెలో పడేలా చిప్స్ కట్టర్ సహాయంతో కట్ చేసుకోవాలి. ఇలా నేరుగా నూనెలో వేయడం వల్ల చిప్స్ అత్తుక్కుపోకుండా ఉంటాయి. ఇలా అన్నింటిని కట్ చేసుకున్న తరువాత మంటపై పెద్దగా చేసి చిప్స్ ను వేయించుకోవాలి. చిప్స్ సగానికి పైగా వేగిన తరువాత ముందుగా కలిపి ఉంచిన పసుపు, ఉప్పు మిశ్రమాన్ని ఒకటిన్నర టేబుల్ స్పూన్ మోతాదులో నూనెలో వేసి కలపాలి.
ఇలా చేయడం వల్ల పసుపు, ఉప్పు చిప్స్ కు బాగా పడుతుంది. చిప్స్ వేగి నురుగు తగ్గిన తరువాత వాటిని టిష్యూ పేపర్ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, కరకరలాడుతూ ఉండే చిప్స్ తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల నెలరోజుల పాటు తాజాగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు ఈ చిప్స్ ను ఎంతో ఇష్టంగా తింటారు. బయట కొనుగోలు చేసే పనిలేకుండా ఈ విధంగా బనానా చిప్స్ ను ఇంట్లోనే తయారు చేసుకుని తినవచ్చు.