Banana Chips : బనానా చిప్స్.. పచ్చి అరటికాయలతో చేసే చిప్స్ చాలా రుచిగా ఉంటాయి.చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. మనం ఎక్కువగా బయట మార్కెట్ లో వీటిని కొనుగోలు చేస్తూ ఉంటాము. అయితే బయట కొనే పని లేకుండా ఈ చిప్స్ ను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. స్నాక్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ చిప్స్ ను తయారుచేసి తీసుకోవచ్చు. ఇంట్లోనే బనానా చిప్స్ ను రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బనానా చిప్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – 3కప్పులు, ఉప్పు – అర టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, పచ్చి అరటికాయలు – 3, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.

బనానా చిప్స్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, పసుపు వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత మరో గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు తీసుకోవాలి. తరువాత ఇందులో అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత అరటికాయలపై ఉండే చెక్కును తీసేసి ముందుగా ఉప్పు కలిపిన నీటిలో వేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక స్లైసర్ ను తీసుకుని దానికి నూనె రాయాలి. తరువాత అరటికాయను తీసుకుని స్లైసర్ తో చిప్స్ తరుగుతూ నేరుగా నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై వేయించాలి. చిప్స్ 80 శాతం వేగిన తరువాత ఉప్పు, పసుపు కలిపిన నీటిని అర టీ స్పూన్ మోతాదులో వేగుతున్న చిప్స్ పై వేసి కలపాలి. తరువాత ఈ చిప్స్ ను పూర్తిగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బనానా చిప్స్ తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల ఇవి చాలా కాలం పాటు తాజాగా ఉంటాయి.