Banana Lassi With Jaggery : వేసవికాలంలో ఎండ కారణంగా మనలో చాలా మంది నీరసం, నిస్సత్తువ, బలహీనత వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే డీహైడ్రేషన్ కు గురి అవుతూ ఉంటారు కూడా. నీరసాన్ని తగ్గించి మనకు తక్షణ శక్తిని ఇచ్చేలా మనం అరటి పండ్లతో లస్సీని తయారు చేసుకుని తాగవచ్చు. ఈ లస్సీని తాగడం వల్ల నీరసం తగ్గుతుంది. శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే రుచితో పాటు ఎండ నుండి ఉపశమనం కూడా కలుగుతుంది. ఈ చల్ల చల్లటి బనానా లస్సీని మరింత ఆరోగ్యంగా మనం పంచదార వేయకుండా కూడా తయారు చేసుకోవచ్చు. బనానా లస్సీని రుచిగా, కమ్మగా పంచదార వేయకుండా ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బనానా లస్సీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చల్లటి పెరుగు – ఒక కప్పు, కాచి చల్లార్చిన పాలు – అర కప్పు, అరటి పండు – 1, ఖర్జూర పండ్లు – 8 నుండి 10, బెల్లం తురుము – ఒక టేబుల్ స్పూన్, తేనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు- చిటికెడు, యాలకుల పొడి – చిటికెడు.
బనానా లస్సీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో పెరుగును తీసుకోవాలి. తరువాత ఇందులో పాలు, ఉప్పు, యాలకుల పొడి, తేనె, బెల్లం తురుము వేసుకోవాలి. తరువాత ఇందులో అరటి పండును ముక్కలుగా చేసి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గ్లాస్ లో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తరువాత ఇందులో మిక్సీ పట్టుకున్న లస్సీని పోసుకుని దానిపై తరిగిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, కమ్మగా ఉండే బనానా లస్సీ తయారవుతుంది. దీనిని తాగడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. వేసవికాలంలో ఎక్కువగా నీరసం, బలహీనత వంటి సమస్యలతో బాధపడే వారు ఇలా ల్సీని తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.