Bangaladumpa Ullikaram : మనం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూరగాయల్లో బంగాళాదుంపలు కూడా ఒకటి. వీటిని మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. బంగాళాదుంపలతో రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. వీటితో చేసే ప్రతి వంటకం కూడా చాలా రుచిగా ఉంటుంది. అందులో భాగంగా ఉల్లికారాన్నివేసి బంగాళాదుంపలతో వంటకాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళాదుంప ఉల్లికారం తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 3 ( మధ్యస్థంగా ఉన్నవి), పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు – 4 ( మధ్యస్థంగా ఉన్నవి), పచ్చిమిర్చి – కారానికి తగినన్ని, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఎండుమిర్చి – 2, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత.
బంగాళాదుంప ఉల్లికారం తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలపై ఉండే పొట్టును తీసి ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఒక జార్ లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం వేసి కలపాలి. దీనిని రంగు మారే వరకు వేయించాలి. తరువాత పసుపు, ఉప్పు వేసి కలపాలి. తరువాత ముందుగా సిద్దం చేసుకున్న బంగాళాదుంప ముక్కలను వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బంగాళాదుంప ఉల్లికారం తయారవుతుంది. దీనిని చపాతీ, రోటి, పుల్కా, దోశ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంపలతో చేసే ఇతర వంటకాల కంటే ఇలా చేసిన బంగాళాదుంప ఉల్లికారాన్నే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.