Basbousa Cake : మనకు బేకరీలల్లో లభించే కేక్ వెరైటీలల్లో బుస్బుసా కేక్ కూడా ఒకటి. ఈ కేక్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా, చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే చాలా మంది ఈ కేక్ ను ఇంట్లో తయారు చేసుకోవడం వీలు కాదని అనుకుంటూ ఉంటారు. కానీ ఒవెన్ లేకపోయినా కూడా ఇంట్లోనే చాలా సులభంగా కేక్ ను తయారు చేసుకోవచ్చు. ఈ కేక్ ను తయారు చేసుకోవడం చాలా సులభం. వంటరాని వారు కూడా ఈ కేక్ ను తయారు చేయవచ్చు. బేకరీ స్టైల్ బుస్బుసా కేక్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బస్బుసా కేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పంచదార – అరకప్పు, బొంబాయి రవ్వ – ఒక కప్పు, మైదాపిండి – అర కప్పు, కరిగించిన బటర్ – 1|/3 కప్పు, ఉప్పు – చిటికెడు, కాచి చల్లార్చిన పాలు – ముప్పావు కప్పు, వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్, వంటసోడా – అర టీ స్పూన్, బేకింగ్ పౌడర్ – అర టీ స్పూన్, నిమ్మరసం – అర చెక్క.
షుగర్ సిరప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పంచదార – అర కప్పు, నీళ్లు – ఒక కప్పు, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క.
బస్బుసా కేక్ తయారీ విధానం..
ముందుగా జార్ లో పంచదార వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత రవ్వ కూడా వేసి మరోసారి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మైదాపిండి, బటర్, ఉప్పు, పాలు పోసి కలపాలి. దీనిని విస్కర్ తో ఒకే దిశలో అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత వంటసోడా, బేకింగ్ పౌడర్, నిమ్మరసం వేసి కలపాలి. ఇప్పుడు పెద్ద గిన్నెలో స్టాండ్ ను ఉంచి దానిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఫ్రీహీట్ చేసుకోవాలి. తరువాత వెడల్పుగా ఉంటే కేక్ గిన్నెను తీసుకుని ముందుగా నూనె రాసుకోవాలి. తరువాత మైదాపిండితో డస్టింగ్ చేసుకోవాలి. తరువాత కేక్ మిశ్రమాన్ని వేసి బుడగలు లేకుండా ట్యాప్ చేసుకోవాలి. తరువాత ఈ గిన్నెను ఫ్రీహీట్ చేసుకున్న గిన్నెలో ఉంచి మూత పెట్టి మధ్యస్థ మంటపై 25 నుండి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి.
అవసరమైతే మరో 2 నుండి 3 నిమిషాల పాటు బేక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెను బయటకు తీయాలి. తరువాత షుగర్ సిరప్ కోసం గిన్నెలో పంచదార, నీళ్లు, దాల్చిన చెక్క వేసి వేడిచేయాలి. పంచదార కరిగి సిరప్ మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కేక్ అంచులను గిన్నె నుండి వేరు చేసుకోవాలి. తరువాత కేక్ ను ముక్కలుగా కట్ చేసుకుని దానిపై గార్నిష్ కోసం బాదంపప్పును ఉంచిన తరువాత కేక్ పైన అంచుల చుట్టూ షుగర్ సిరప్ ను వేసుకోవాలి. తరువాత కేక్ ను ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. లేదంటే 2 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచి ఆ తరువాత కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బుస్బుసా కేక్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.