Bathani Chaat : మనకు సాయంత్రం సమయంలో రోడ్ల పక్కన బండ్ల మీద, చాట్ బండార్ లలో లభించే పదార్థాల్లో బఠాణీ చాట్ కూడా ఒకటి. బఠాణీ చాట్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. అలాగే మనకు వివిధ రుచుల్లో ఈ బఠాణీ చాట్ లభిస్తూ ఉంటుంది. ఈ బఠాణీ చాట్ ను మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా చేసే ఈ బఠానీ చాట్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. అందరికి నచ్చేలా బఠాణీ చాట్ ను రుచిగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బఠాణీ చాట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
రాత్రంతా నానబెట్టిన తెల్లటి ఎండు బఠాణీలు – 2 కప్పులు, నీళ్లు – ఒక లీటర్, నూనె – 50 ఎమ్ ఎల్, జీలకర్ర – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకులు – 2, ఎండుమిర్చి – 2, తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన టమాటాలు – 2, ఉప్పు – తగినంత, వేయించిన జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్.
బఠాణీ చాట్ తయారీ విధానం..
ముందుగా నానబెట్టిన బఠాణీలను కుక్కర్ లో వేసి నీళ్లు పోసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. బఠాణీలు మెత్తగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి పోయే వరకు పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, బిర్యానీ ఆకులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకువేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి కలపాలి. తరువాత ఉడికించిన బఠాణీలను నీటితో సహా వేసుకోవాలి.
తరువాత 300 నుండి 500 ఎమ్ వరకు నీటిని పోసి కలపాలి. తరువాత దీనిని మధ్యస్థ మంటపై 15 నుండి 18 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ చాట్ ను ప్లేట్ లోకి తీసుకుని దానిపై టమాట ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బఠాణీ చాట్ తయారవుతుంది. ఇలా ఇంట్లోనే బఠాణీ చాట్ ను తయారు చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ చాట్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.