Bellam Thalikalu : బెల్లం తాళికలు.. బియ్యం పిండితో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో ఇవి కూడా ఒకటి. ఈ తాళికలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా ఉంటాయి. ఈ తీపి వంటకాన్ని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈ బెల్లం తాళికలను తయారు చేయడం కూడా చాలా సులభం. బియ్యం పిండి, బెల్లం ఉంటే చాలు వీటిని అరగంటలో తయారు చేసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు ఈ బెల్లం తాళికలను తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ బెల్లం తాళికలను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం తాళికల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – ఒక కప్పు, పంచదార – ఒక టీ స్పూన్, యాలకులు – 5, బెల్లం – 100 గ్రా., నీళ్లు – 3 గ్లాసులు, ఉప్పు -తగినంత, పచ్చి కొబ్బరి తురుము -ఒక టేబుల్ స్పూన్.
బెల్లం తాళికల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు మరుగుతుండగానే ఉప్పు వేసి కలపాలి. తరవాత బియ్యం పిండి వేసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పిండి చల్లారిన తరువాత తాళికలుగా చేసుకోవాలి. కొద్ది కొద్ది పిండిని తీసుకుంటూ సన్నగా పొడవుగా రోల్ చేసుకోవచ్చు లేదా గుండ్రంగా చేసుకోవచ్చు. ఇలా అన్నింటిని తయారు చేసిన తరువాత కళాయిలో ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోసి వేడి చేయాలి. తరువాత బెల్లం తురుము, పంచదార వేసి కలపాలి. బెల్లం కరిగిన తరువాత ఉప్పు, కొబ్బరి తురుము,యాలకుల పొడి వేసి మరో 5 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి.
ఇలా ఉడికించిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న పాల తాళికలు వేసి కలపాలి. వీటిని మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తరువాత ఈ పాలతాళికలను గిన్నెలో వేసి సర్వ్ చేసుకోవాలి. ఇందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ను నెయ్యిలో వేయించి వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం తాళికలు తయారవుతాయి. వీటిని తినడం వల్ల రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.