Bendakaya Karam Podi : మన ఆరోగ్యానికి బెండకాయలు ఎంతో మేలు చేస్తాయి. వీటితో వంటకాలు తయారు చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. బెండకాయలతో చేసే ఏ వంటకమైన చాలా రుచిగా ఉంటుంది. అయితే తరుచూ ఒకేరకంగా కాకుండా కింద చెప్పిన విధంగా చేసే బెండకాయ కారం పొడి కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ బెండకాయ కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – అర కప్పు, నూనె – పావు కప్పు, వాము – ఒక టీ స్పూన్, పొడవుగా కట్ చేసిన లేత బెండకాయలు – అరకిలో, ఉప్పు – తగినంత, ఆమ్ చూర్ పొడి – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, సోంపు పొడి – అర టీ స్పూన్.
బెండకాయ కారం పొడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో శనగపిండి వేసి వేయించాలి. దీనిని కొద్దిగా రంగు మారే వరకు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ శనగపిండిలో ధనియాల పొడి, గరం మసాలా, కారం, సోంపు పొడి వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వాము వేసి వేయించాలి. తరువాత బెండకాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత ఉప్పు, ఆమ్ చూర్ పొడి వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి బెండకాయ ముక్కలను మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి. బెండకాయ ముక్కలు వేగిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న శనగపిండి వేసి కలపాలి. తరువాత మూత పెట్టి మరో 4 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ కారం పొడి తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన బెండకాయ వేపుడును ఒక్క ముక్క కూడా విడిచిపెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.