Bendakaya Pulusu : మనం వంటింట్లో అప్పుడప్పుడూ పులుసు కూరలను కూడా తయారు చేస్తూ ఉంటాం. పులుసు కూరలు చేయడానికి వీలుగా ఉండే కూరగాయల్లో బెండకాయలు కూడా ఒకటి. బెండకాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పులుసును ఇష్టంగా తింటారు. బెండకాయ పులుసును మనం మరింత రుచిగా అలాగే చిక్కగా ఉండేలా కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. చిక్కగా , మరింత రుచిగా బెండకాయ పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్ద ముక్కలుగా తరిగిన బెండకాయలు – పావు కిలో, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మెంతులు – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 2, పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలు – 10, అల్లం తురుము – ఒక టీ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – మధ్యస్థంగా ఉన్నవి నాలుగు, తరిగిన పచ్చిమిర్చి – 3, పెద్ద టమాటాలు – 2, పసుపు – అర టీ స్పూన్, రాళ్ల ఉప్పు – ఒకటిన్నర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, నీళ్లు – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
బెండకాయ పులుసు తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బెండకాయ ముక్కలను వేసి 3 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మరికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మెంతులు, ఇంగువ వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం తురుము వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు వేయించాలి. తరువాత పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు టమాటాలను పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి.
దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత మూత పెట్టి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత వేయించిన బెండకాయలు వేసి కలపాలి. వీటిని మూడు నిమిషాల పాటు వేయించిన తరువాత చింతపండు రసం, నీళ్లు పోసి కలపాలి. తరువాత కొత్తిమీర వేసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 10 నుండి 12 నిమిషాల పాటు చక్కగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన బెండకాయ పులుసును అందరూ లొట్టలేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు.