Besan Ponganalu : మనం శనగపిండితో రకరకాల వంటకాలను స్నాక్స్ ను, పిండి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. శనగపిండితో చేసే వంటకాలు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. చాలా మంది శనగపిండితో చేసిన వంటకాలను ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే తరచూ ఒకేరకం వంటకాలు కాకుండా శనగపిండితో మనం ఎంతో రుచిగా ఉండే పొంగనాలను కూడా తయారు చేసుకోవచ్చు. అల్పాహారంగా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. అలాగే ఉదయం సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా అప్పటికప్పుడు శనగపిండితో పొంగనాలను తయారు చేసుకుని తినవచ్చు. చట్నీ లేదా టమాట సాస్ తో తిన్నా కూడా ఈ పొంగనాలు చాలా రుచిగా ఉంటాయి. శనగపిండితో రుచిగా, అందరికి నచ్చేలా పొంగనాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బేసన్ పొంగనాల తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – 3 టీ స్పూన్స్, కచ్చా పచ్చాగా దంచిన పచ్చిమిర్చి – 4, ఉప్పు – తగినంత, వాము – అర టీ స్పూన్, నిమ్మకాయ – 1, వంటసోడా – పావు టీ స్పూన్.
బేసన్ పొంగనాల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో మిగిలిన పదార్థాలన్నింటిని వేసి బాగా కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పొంగనాల పిండిలా కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద పొంగనాల పెనాని ఉంచి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఒక్కో గుంతలో ఒక్కోటేబుల్ స్పూన్ పిండిని వేసుకోవాలి. తరువాత మూత పెట్టి కాల్చుకోవాలి. ఈ పొంగనాలు ఒకవైపే ఎర్రగా అయిన తరువాత మరో వైపుకు తిప్పి మరలా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బేసన్ పొంగనాలు తయారవుతాయి. స్నాక్స్ గా తినడానికి కూడా ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.