Bigg Boss OTT Telugu : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 కు వచ్చిన ఆదరణతో నిర్వాహకులు ఇప్పుడు బిగ్‌బాస్ ఓటీటీ తెలుగును కూడా ప్రారంభించనున్నారు. త్వరలోనే ఈ షో ప్రారంభం అవుతుందని ఇటీవలే నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ షోలో ఎవరెవరు పాల్గొంటారు ? అన్న సస్పెన్స్ ఇంకా వీడడం లేదు. ఇందులో గత సీజన్‌ల కంటెస్టెంట్లు అయిన తేజస్వి మడివాడ, ముమైత్ ఖాన్‌లు పాల్గొంటారని.. వారి పేర్లు కన్‌ఫామ్ అయ్యాయని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు.
అయితే బిగ్‌బాస్ ఓటీటీ తెలుగులో పలు పాత ముఖాలతోపాటు కొందరు కొత్త కంటెస్టెంట్లు కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ముఖ్యంగా యాంకర్ స్రవంతి, యాంకర్ శివ, విశ్వక్ మూవీ హీరో అర్జున్, మోడల్ అనిల్ రాథోడ్, మహేష్ విట్టా, అషు రెడ్డి, 7 ఆర్ట్స్ సరయు, అఖిల్, అరియానా వంటి వారు పాల్గొంటారని సమాచారం. ఇక వీరిలో మహేష్ విట్టా, అషు రెడ్డి, అఖిల్, అరియానాలు ఇది వరకే టీవీ బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు.
ఇక విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం బిగ్‌బాస్ ఓటీటీ తెలుగులో టాప్ 5లో వచ్చిన ఐదు మంది కంటెస్టెంట్లను తరువాత వచ్చే బిగ్‌బాస్ సీజన్ 6 లో నేరుగా తీసుకుంటారని తెలుస్తోంది. అదే జరిగితే ఓటీటీ కంటెస్టెంట్లకు లక్ కలసి వస్తుందని చెప్పవచ్చు.
ఇక బిగ్ బాస్ ఓటీటీ తెలుగు షోకు కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు తెలిసింది. ఈ షోను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో రోజుకు 24 గంటలూ లైవ్ స్ట్రీమ్ చేస్తారు. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ఈ షోను ప్రారంభిస్తారని తెలుస్తోంది. అలాగే ఇందులో 16 నుంచి 18 మంది కంటెస్టెంట్లు పాల్గొంటారని సమాచారం.