Biscuit Cake : మనకు బేకరీలలో లభించే రుచికరమైన ఆహార పదార్థాల్లో కేక్ కూడా ఒకటి. కేక్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. మనకు వివిధ రుచుల్లో ఈ కేక్ లభిస్తూ ఉంటుంది. అలాగే మనం ఇంట్లో కూడా చాలా సులభంగా ఈ కేక్ ను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన కేక్ వెరైటీలలో బిస్కెట్ కేక్ కూడా ఒకటి. బిస్కెట్ కేక్ చాలా రుచిగా ఉంటుంది. మనకు సులభంగా లభించే బిస్కెట్లతో ఈ కేక్ ను అరగంటలో తయారు చేసుకోవచ్చు. ఎంతో మెత్తగా, రుచిగా ఉండే ఈ బిస్కెట్ కేక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బిస్కెట్ కేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పార్లెజి బిస్కెట్స్ – 180 గ్రా., బేకింగ్ పౌడర్ – ముప్పావు టీ స్పూన్, పంచదార పొడి – 2 టేబుల్ స్పూన్స్, పాలు – ఒకటిన్నర కప్పు, వెనీలా ఎసెన్స్ – పావు టీ స్పూన్, టూటీ ఫ్రూటీ – కొద్దిగా.
బిస్కెట్ కేక్ తయారీ విధానం..
ముందుగా బిస్కెట్లని ముక్కలుగా చేసుకుని జార్ లోకి తీసుకోవాలి. ఈ బిస్కెట్లని మెత్తని పొడిగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో బేకింగ్ పౌడర్, పంచదార పొడి వేసి కలపాలి. తరువాత పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. చివరగా కొన్ని టైటీ ఫ్రూటీలను వేసి కలపాలి. ఇప్పుడు కుక్కర్ లో ఇసుక లేదా ఉప్పు వేసి 10 నిమిషాల పాటు వేడి చేయాలి. తరువాత కేక్ గిన్నెకు నూనెను లేదా నెయ్యిని రాయాలి. తరువాత దీనిపై పిండిని చల్లుకుని డస్టింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ మిశ్రమాన్ని వేసుకుని ఉండలు లేకుండా గిన్నెను బాగా తట్టాలి. తరువాత దీనిపై మరికొన్ని టూటీ ఫ్రూటీలను వేసి ఈ కేక్ గిన్నెను కుక్కర్ లో ఉంచాలి.
కుక్కర్ మూతకు ఉండే రబ్బర్ ను, విజిల్ ను తీఏసి మూత పెట్టాలి. ఈ కేక్ ను 25 నుండి 30 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కేక్ చక్కగా ఉడికిందో లేదో చూసుకుని గిన్నెను బయటకు తీయాలి. ఇప్పుడు కేక్ ను చాకుతో గిన్నె నుండి వేరు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత నచ్చిన ఆకారంలో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బిస్కెట్ కేక్ తయారవుతుంది. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ఇంట్లోనే సులభంగా బిస్కెట్లతో రుచికరమైన కేక్ ను తయారు చేసుకుని తినవచ్చు.