Biyyam Pindi Halwa : బియ్యంతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పిండి వంటకాలు, చిరుతిళ్లే కాకుండా బియ్యంతో తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. బియ్యంతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో బియ్యంపిండి హల్వా కూడా ఒకటి. ఈ హల్వాను తమిళనాడులో తిరువాతిరై కలి అని పిలుస్తారు. విష్ణుమూర్తికి నైవేథ్యంగా సమర్పించడానికి దీనిని తయారు చేస్తూ ఉంటారు. దీనిని మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ హల్వా మనం తయారు చేసే చక్కెరపొంగలి మాదిరి ఉంటుంది. ఒక్కసారి ఈ హల్వాను రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. నైవేథ్యంగా సమర్పించే ఈ తిరువాతిరై కలి( బియ్యంపిండి హల్వా)ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యంపిండి హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
గంటపాటు నానబెట్టిన బియ్యం – ఒక కప్పు, పెసరపప్పు – పావు కప్పు, బెల్లం తురుము – ఒకటిన్నర కప్పు, నీళ్లు – ఒక కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – 10 నుండి 15, పచ్చ కర్పూరం – కొద్దిగా.
బియ్యంపిండి హల్వా తయారీ విధానం..
ముందుగా నానబెట్టిన బియ్యాన్ని నీరంతా పోయేలా పూర్తిగా వడకట్టుకోవాలి. తరువాత ఈ బియ్యాన్ని, పెసరపప్పును కళాయిలో వేసి చిన్న మంటపై వేయించాలి. బియ్యం రంగు మారిన తరువాత వీటిని జార్ లో వేసి పిండిలాగా లేదా బొంబాయి రవ్వ లాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో బెల్లం తురుము, కొద్దిగా నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత దీనిని వడకట్టి మరలా కళాయిలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక కప్పు నీళ్లు పోసి బాగా మరిగించాలి. నీళ్లు వేడయ్యాక యాలకుల పొడి, మిక్సీ పట్టుకున్న బియ్యం వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించాలి. ఈ మిశ్రమం పూర్తిగా దగ్గర పడిన తరువాత మూత పెట్టి మంటను చిన్నగా చేసి ఉడికిస్తూ ఉండాలి.
ఇలా ఇది ఉడుకుతుండగానే మరో కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసి వేయించాలి. తరువాత ఈ జీడిపప్పును ఉడుకుతున్న హల్వాలో వేసి కలపాలి. తరువాత పచ్చ కర్పూరం కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బియ్యంపిండి హల్వా తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ హల్వా రెండు నుండి మూడు రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ హల్వాను తయారు చేసుకుని తినవచ్చు.