Boondi Mithayi : బూందీ చిక్కి.. బూందీ మిఠాయి.. పేరేదైనా దీని రుచి మాత్రం కమ్మగా ఉంటుంది. పండుగలకు దీనిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. మనకు బయట స్వీట్ షాపుల్లో కూడా ఈ బూందీ మిఠాయి లభిస్తుంది. దీనిని తయారు చేసే విధానం మనలో చాలా మందికి తెలిసినప్పటికి ఈ చిక్కి మెత్తగా లేదా గట్టిగా అవుతూ ఉంటుంది. ఈ బూందీ చిక్కిని రుచిగా, చక్కగా స్వీట్ షాపుల్లో లభించే విధంగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బూందీ చిక్కి తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, బియ్యం పిండి – ఒక కప్పు, బెల్లం తురుము – ఒక కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
బూందీ మిఠాయి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండి, బియ్యం పిండిని తీసుకోవాలి. తరువాత దీనిలో తగినన్ని నీళ్లు పోసి పిండిని పలుచగా గంటె జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక బూందీ గంటెను తీసుకుని అందులో పిండి వేస్తూ బూందీని వేసుకోవాలి. ఈ బూందీని రంగు మారి కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా బూందీని తయారు చేసుకున్న తరువాత మరో కళాయిలో బెల్లం తురుము, అర టీ గ్లాస్ నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగి ముదురు పాకం వచ్చే వరకు ఉడికించాలి. బెల్లం మిశ్రమాన్ని నీటిలో వేసి చూస్తే గట్టిగా ముద్దగా అవ్వాలి. ఇలా ఉడికించిన తరువాత అందులో యాలకుల పొడితో పాటు ముందుగా వేయించుకున్న బూందీని వేసి కలపాలి. బూందీకి బెల్లం మిశ్రమం పట్టిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకోవాలి.
తరువాత దీనిని పైన సమానంగా ప్లేట్ అంతా చేసుకోవాలి. ఇది గోరు వెచ్చగా అయిన తరువాత కావల్సిన ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తరువాత ముక్కలుగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బూందీ మిఠాయి తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు, పండుగలకు, ప్రత్యేక సందర్భాల్లో ఇలా బూందీ చిక్కిని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఇష్టంగా తింటారు.