Bread Badusha : మనం బ్రెడ్ తో రకరకాల తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. అయితే బ్రెడ్ తో తరచూ చేసే వంటకాలతో పాటు మనం బ్రెడ్ తో బాదుషాలను కూడా తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ తో చేసే బాదుషాలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా రుచిగా ఉంటాయి. ఈ బాదుషాలను తయారు చేయడం కూడా చాలా సులభం. బ్రెడ్ తో రుచికరమైన బాదుషాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ బాదుషా తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రెడ్ ప్యాకెట్ – 1, కాచి చల్లార్చిన పాలు – తగినన్ని, పంచదార – ఒకటిన్నర కప్పులు, దంచిన యాలకులు – 2, నీళ్లు – ఒక కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
బ్రెడ్ బాదుషా తయారీ విధానం..
ముందుగా బ్రెడ్ కు ఉండే అంచులను తీసేసి వాటిని ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఈ ముక్కలను జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా పాలను పోస్తూ పిండి ఉండలా మెత్తగా కలుపుకోవాలి. చివరికి నెయ్యి వేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో పంచదార, యాలకులు, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగిన తరువాత మరో రెండు నుండి మూడు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాతనిమ్మరసం పిండి కలిపి మూత పెట్టి పక్కకు ఉంచాలి. ఇప్పుడు ముందుగా కలిపిన పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుని బాదుషా ఆకారంలో వత్తుకోవాలి.
ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తరువాత బాదుషాలను వేసి వేయించాలి. వీటిని రెండు నిమిషాల పాటు కదిలించకుండా అలాగే ఉంచాలి. తరువాత వీటిని అటూ ఇటూ కదుపుతూ మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తరువాత వీటిని పంచదార పాకంలో వేసి మూత పెట్టి 2 నుండి 3 గంటల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ బాదుషా తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు బ్రెడ్ తో ఇలా చాలా సులభంగా, రుచిగా బాదుషాలను తయారు చేసుకుని తినవచ్చు.