Bread Kalakand : మనం బ్రెడ్ తో చిరుతిళ్లతో పాటు రకరకాల తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో బ్రెడ్ కలాకంద్ కూడా ఒకటి. బ్రెడ్ కలాకంద్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా ఉంటుంది. బ్రెడ్ కలాకంద్ ను తయారు చేయడం చాలా తేలిక. అలాగే దీనిని తయారు చేయడానికి ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైనా చాలా సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. దీనిని పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ బ్రెడ్ కలాకంద్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ కలాకంద్ తయారీకి కావల్సిన పదార్థాలు..
వీట్ బ్రెడ్ – 5 స్లైసెస్, నెయ్యి – 2 టీ స్పూన్స్, చిక్కటి పాలు – అర లీటర్, పంచదార – అర కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్.
బ్రెడ్ కలాకంద్ తయారీ విధానం..
ముందుగా బ్రెడ్ ను ముక్కలుగా చేసుకుని జార్ లో వేసుకోవాలి. ఈ బ్రెడ్ ను మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక బ్రెడ్ పొడిని వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఇదే కళాయిలో పాలు పోసి వేడి చేయాలి. ఈ పాలను మీగడ కట్టకుండా సగం అయ్యే వరకు బాగా మరిగించాలి. ఇలా మరిగించిన తరువాత వేయించిన బ్రెడ్ పొడి వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత పంచదార , యీలకుల పొడి వేసి కలపాలి.
తరువాత మరో టీ స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. ఈ బ్రెడ్ మిశ్రమాన్ని కళాయికి అంటుకోకుండా వేరయ్యే వరకు బాగా వేయించి నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమానంగా చేసుకోవాలి. తరువాత దీనిపై తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి అవి ఊడిపోకుండా కొద్దిగా లోపలికి వత్తి పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత దీనిని మనకు కావల్సిన ఆకారంలో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ కలాకంద్ తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు, ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ఇలా బ్రెడ్ తో సులభంగా కలాకంద్ ను తయారు చేసుకుని తినవచ్చు.