Butter : మనం మసాలా వంటకాల్లో, బ్రెడ్ టోస్ట్ ను చేసుకోవడానికి అలాగే వివిధ రకాలుగా బటర్ ను ఉపయోగిస్తూ ఉంటాము. బటర్ వేయడం వల్ల మనం చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. బటర్ ను సాధారణంగా మనం బయట నుండి కొనుగోలు చేస్తాము. ఇకపై బయట కొనే పనిలేకుండా బయట లభించే ఈ బటర్ ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా చాలా తేలికగా బటర్ ను తయారు చేసుకోవచ్చు. అచ్చం బయట లభించే విధంగా ఉండే బటర్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బటర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మీగడ – 10 రోజుల పాటు నిల్వ చేసింది, నీళ్లు – అర కప్పు.
బటర్ తయారీ విధానం..
ముందుగా చిక్కటి పాలను కాగబెట్టి చల్లారిన తరువాత ఫ్రిజ్ లో ఉంచాలి. ఫ్రిజ్ లో ఉంచడం వల్ల పాల మీద మీగడ ఎక్కువగా తయారవుతుంది. ఈ మీగడను మూత ఉండే గిన్నెలో ఉంచి డీఫ్రిజ్ లో నిల్వ చేసుకోవాలి. ఇలా పది రోజుల పాటు నిల్వ చేసుకున్న మీగడను బటర్ తయారు చేయడానికి ముందు ఒక గంట ముందు ఫ్రిజ్ లో నుండి తీసి బయట ఉంచాలి. మీగడ గది ఉష్ణోగ్రతకు వచ్చిన తరువాత దీనిని తీసి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. తరువాత కవ్వం లేదా విస్కర్ లేదా బీటర్ తో మీగడను 3 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. తరువాత అర కప్పు నీటిని పోసి మరో 3 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బటర్ తయారవుతుంది.
ఇప్పుడు ఇందులో ఒక కప్పు చల్లటి నీటిని పోసి కలుపుకోవాలి. తరువాత బటర్ ను తీసి వేరే గిన్నెలో వేసి చల్లటి నీటితో 3 నుండి 4 సార్లు బాగా కడుక్కోవాలి. తరువాత ఈ బటర్ ను బటర్ పేపర్ పై వేసి మనకు నచ్చిన ఆకారంలో సర్దుకోవాలి. తరువాత దీనిని మూసేసి డీఫ్రిజ్ లో ఒక గంట పాటు ఉంచాలి. డీఫ్రిజ్ లో ఉంచడం వల్ల బటర్ గట్టిగా మారుతుంది. ఇలా చేయడం వల్ల అచ్చం మార్కెట్ లో లభించే బటర్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ బటర్ ను 8 నుండి 10 రోజుల వ్యవధిలోనే ఉపయోగించుకోవాలి.