Cabbage Masala Vada : మనం క్యాబేజిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. క్యాబేజిలో కూడా పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. తగిన మోతాదులో క్యాబేజిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. క్యాబేజితో కూరలే కాకుండా వివిధ రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. క్యాబేజితో చేసుకోదగిన చిరుతిళ్లల్లో క్యాబేజి మసాలా వడ కూడా ఒకటి. క్యాబేజితో చేసే ఈ మసాలా వడలు చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. అప్పటికప్పుడు ఇన్ స్టాంట్ గా వీటిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే క్యాబేజి మసాలా వడలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజి మసాలా వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యాబేజి తురుము – ఒక కప్పు, శనగపిండి- ముప్పావు కప్పు, బియ్యంపిండి – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కారం – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, నానబెట్టిన శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
క్యాబేజి మసాలా వడ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో క్యాబేజి తురుమును తీసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత నీళ్లు పోయకుండా ముందుగా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా నీటిని చల్లుకుంటూ కలుపుకోవాలి. తరువాత క్యాబేజి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ముందుగా ఉండలుగా చేసుకోవాలి. తరువాత వడలుగా వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వడలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజి మసాలా వడలు తయారవుతాయి. వీటిని టమాట సాస్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా ఏం తినాలో తోచనప్పుడు ఇలా ఇన్ స్టాంట్ గా క్యాబేజి వడలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ వడలను ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.