Cabbage Pulihora : క్యాబేజితో మనం రకరకాల వంటకాలు తయారు చేస్తూ ఉంటాము. క్యాబేజితో చేసే వంటకాలను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ క్యాబేజితో మనం ఎక్కువగా వేపుడు, పప్పు వంటి వంటకాలనే తయారు చేస్తూ ఉంటాము. కానీ క్యాబేజితో మనం మరో రుచికరమైన వంటకాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. అదే క్యాబేజి పులిహోర. క్యాబేజితో చేసే ఈ వంటకం పుల్ల పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా తేలిక. క్యాబేజితో తరచూ చేసే వంటకాలతో పాటు ఈ వంటకాన్ని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ క్యాబేజి పులిహోరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజి పులిహోర తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యాబేజి – అరకిలో, శనగపప్పు – 4 టీ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – 20 గ్రా., నూనె – 4 టీ స్పూన్స్, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు -2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 2, పచ్చిమిర్చి – 8, కరివేపాకు – రెండు రెమ్మలు, ఉప్పు – తగినంత, ఆవాలు -ఒక టీ స్పూన్, అల్లం – ఒక ఇంచు ముక్క, తరిగినకొత్తిమీర – కొద్దిగా.
క్యాబేజి పులిహోర తయారీ విధానం..
ముందుగా క్యాబేజిని చిన్నగా తరిగి శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో రెండు గ్లాసుల నీళ్లు, పసుపు, నూనె వేసి మూత పెట్టి క్యాబేజిని ఉడికించాలి. క్యాబేజి ఉడికిన తరువాత దీనిని వడకట్టి ప్లేట్ లో వేసి ఆరబెట్టాలి. క్యాబేజి ఆరిన తరువాత దీనిని చేత్తో ఎక్కువగా ఉండే నీటిని పిండేసి గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత చింతపండు నుండి రసాన్ని తీసుకోవాలి. తరువాత ఒక జార్ లో ఆవాలు, అల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.
తరువాత అదే నూనెలో తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత చింతపండు రసం, ఉప్పు వేసి కలపాలి. ఈ చింతపండు గుజ్జును నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న క్యాబేజి వేసి కలపాలి. దీనిని 3 నిమిషాల పాటు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న ఆవాల మిశ్రమం, వేయించిన పల్లీలు వేసి కలపాలి. తరువాత కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజి పులిహోర తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వంటకాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.