మన హిందూ సంప్రదాయంలో ప్రతిరోజు నిత్యం ఏదో ఒక పూజలు వ్రతాలు అంటూ మహిళలు ఎక్కువగా పూజలు చేస్తుంటారు. అయితే మహిళలు గర్భం దాల్చితే పూజలు చేయకూడదని, కొన్ని ముఖ్యమైన పనులు కూడా కుటుంబ సభ్యులు చేయకూడదని, గర్భం దాల్చిన మహిళ గుడికి వెళ్లకూడదని మన పెద్దవారు చెబుతుంటారు. అయితే నిజంగానే గర్భిణి స్త్రీలు ఆలయానికి వెళ్ళకూడదా.. వెళ్తే ఏం జరుగుతుంది? అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.
శాస్త్రం ప్రకారం ఇంట్లో మహిళ గర్భం దాల్చితే ఇంటిలోని కుటుంబ సభ్యుల ప్రభావం గర్భంలో పెరుగుతున్న బిడ్డ పై పడుతుంది. కనుక ఒక స్త్రీ గర్భం దాల్చిన మూడు నెలల తర్వాత ఎలాంటి పూజా కార్యక్రమాలు, భవన నిర్మాణాలను చేపట్టకూడదని శాస్త్రం చెబుతోంది.మరి గర్భందాల్చిన స్త్రీలు పూజ చేయవచ్చా అనే విషయానికి వస్తే అందుకు కూడా కొన్ని కారణాలు ఉన్నాయి.
గర్భందాల్చిన స్త్రీలు పూజా కార్యక్రమాలలో పాల్గొనకూడదని కొందరు చెబుతుంటారు. అయితే ఇది ఆధ్యాత్మికంగాను ఆరోగ్య పరంగాను దృష్టిలో ఉంచుకొని ఈ విషయాలను చెబుతున్నారు. కడుపుతో ఉన్న మహిళ పూజలో ఎక్కువసేపు కూర్చోవాలి, ఉపవాసాలు పూజలు చేయాలంటే ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కడుపులో బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది కనుక ఈ పూజలు చేయకూడదు ఉపవాసాలు ఉండకూడదని చెబుతారు. ఇక గుడికి కూడా వెళ్లకూడదని చెబుతారు. అప్పట్లో గుడులు చాలా ఎత్తులో ఉండేవి.అంత పైకి గర్భందాల్చిన స్త్రీ ఎక్కాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది కనుక గర్భవతులు గుడికి రాకూడదన్న నియమం పెట్టారు. అప్పటినుంచి గర్భంతో ఉన్న మహిళ ఆలయానికి వెళ్లకూడదని చెబుతారు.