Capsicum Palli Karam : మనం క్యాప్సికాన్ని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. క్యాప్సికంలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు దాగి ఉన్నాయి. క్యాప్సికంను కూడా మనం తప్పకుండా ఆహారంగా తీసుకోవాలి. క్యాప్సికంను మనం ఎక్కువగా ఇతర వంటకాల్లో వాడుతూ ఉంటాము. ఇతర వంటకాల్లో వాడడంతో పాటు క్యాప్సికంతో ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం పల్లికారాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. క్యాప్సికంతో చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో దీనిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ క్యాప్సికం పల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాప్సికం పల్లి కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన క్యాప్సికం – పావుకిలో, పల్లీలు – పావు కప్పు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – అర టీ స్పూన్, మినపప్పు – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన ఉల్లిపాయ – 1, వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా -పావు టీ స్పూన్, కొత్తిమీర – కొద్దిగా.
క్యాప్సికం పల్లి కారం తయారీ విధానం..
ముందుగా పల్లీలను కళాయిలో వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిపై ఉండే పొట్టును తీసేసి జార్ లో వేసుకోవాలి. తరువాత ఈ పల్లీలను బరకగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తరువాత క్యాప్సికం ముక్కలు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ క్యాప్సికం ముక్కలను మెత్తగా అయ్యే వరకు వేయించాలి. క్యాప్సికం ముక్కలు వేగిన తరువాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం పల్లికారం తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. క్యాప్సికంతో ఈ విధంగా తయారు చేసిన పల్లికారాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.