Capsicum Rice : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో క్యాప్సికం కూడా ఒకటి. క్యాప్సికంలో కూడా ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. క్యాప్సికంను ఎక్కువగా మనం ఇతర వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఇతర వంటకాల్లో వాడడంతో పాటు ఈ క్యాప్సికంతో మనం ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం రైస్ ను కూడా తయారు చేసుకోవచ్చు. క్యాప్సికం రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఎవరైనా ఈ రైస్ ను తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ క్యాప్సికం రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాప్సికం రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 2, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన టమాట – 1, తరిగిన క్యాప్సికం – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, అన్నం – ఒక కప్పు బియ్యంతో వండినంత, నిమ్మకాయ – 1, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.
క్యాప్సికం రైస్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత క్యాప్సికం ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. క్యాప్సికం చక్కగా వేగిన తరువాత అన్నం వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత నిమ్మకాయ, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం రైస్ తయారవుతుంది. లంచ్ బాక్స్ లోకి, డిన్నర్ లోకి లేదా ఇంట్లో అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు ఇలా అప్పటికప్పుడు క్యాప్సికం రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అంతదరూ ఎంతో ఇష్టంగా తింటారు.