Capsicum Tomato Roti Pachadi : క్యాప్సికం టమాట రోటి పచ్చడి.. క్యాప్సికం, టమాటాలు కలిపి చేసేఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో, నెయ్యితో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని తయారు చేయడం చాలా సులభం. రోలు అందుబాటులో లేని వారు మిక్సీలో ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. క్యాప్సికంతో చేసే వంటల కంటే ఈ పచ్చడి రుచిగా ఉంటుందని చెప్పవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ క్యాప్సికం టమాట పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాప్సికం టమాట రోటి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 10 నుండి 15, జీలకర్ర – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 5, చింతపండు – ఉసిరికాయంత, కొత్తిమీర- గుప్పెడు, తరిగిన క్యాప్సికం – పెద్దవి రెండు, తరిగిన టమాటాలు – పెద్దవి రెండు, ఉప్పు – తగినంత.
క్యాప్సికం టమాట రోటి పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కొత్తిమీర వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో మరికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.తరువాత క్యాప్సికం ముక్కలు, టమాట ముక్కలు వేసి వేయించాలి. టమాట ముక్కలు మెత్తగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు రోట్లో ముందుగా వేయించిన పచ్చిమిర్చిని వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత వేయించిన క్యాప్సికం, టమాటాలు, ఉప్పు వేసి దంచుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత తాళింపు తయారు చేసి పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం టమాట పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగాఉంటుంది. క్యాప్సికంతో తరుచూ ఒకేరకం వంటకాలు కాకుండా ఇలా పచ్చడిని కూడా తయారు చేసుకుని తీసుకోవచ్చు.