Carrot Paneer Payasam : సాయంత్రం అవగానే చాలా మంది ఏదో ఒక చిరుతిండి తినాలని చూస్తుంటారు. అందుకనే సాయంత్రం పూట బయటకు వచ్చి రహదారుల పక్కన బండ్లపై అనేక చిరుతిళ్లను తింటుంటారు. వాస్తవానికి అవన్నీ మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు. ఇంట్లోనే మనం చిరుతిళ్లను తయారు చేసి తినవచ్చు. దీంతో అనారోగ్య సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. అయితే ఇంట్లో చేసుకుని తీసుకోదగిన చిరుతిళ్లలో క్యారెట్, పనీర్ పాయసం కూడా ఒకటి. దీన్ని ఎంతో సులభంగా తయారు చేయవచ్చు. సాయంత్రం సమయంలో స్నాక్స్ బదులుగా తాగవచ్చు. దీంతో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. రెండూ లభిస్తాయి. ఇక ఈ పాయసం తయారీకి ఏమేం కావాలో, దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్, పనీర్ పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కని పాలు – రెండు కప్పులు, కొబ్బరి పాలు – అర కప్పు, పనీర్ – అర కప్పు, క్యారెట్లు – 2, యాలకుల పొడి – అర టీస్పూన్, డ్రై ఫ్రూట్స్ పలుకులు – అన్నీ కలిపి పావు కప్పు, నెయ్యి – 2 పెద్ద టీస్పూన్లు, చక్కెర – అర కప్పు.
క్యారెట్, పనీర్ పాయసం తయారు చేసే విధానం..
ముందుగా క్యారెట్లను ఉడికించుకోవాలి. తరువాత మిక్సీలో వేసి ముద్దల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో పాలు తీసుకుని స్టవ్ మీద పెట్టాలి. అవి మరిగాక చక్కెర, పనీర్ తురుము వేసి బాగా కలపాలి. చక్కెర పూర్తిగా కరిగాక క్యారెట్ ముద్ద, కొబ్బరిపాలు, యాలకుల పొడి వేసి స్టవ్‌ని సిమ్‌లో పెట్టాలి. ఇది చిక్కబడుతున్నప్పుడు నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ పలుకులు వేసి దింపాలి. దీంతో ఎంతో రుచికరమైన క్యారెట్, పనీర్ పాయసం రెడీ అవుతుంది. దీన్ని వేడిగా ఉన్నప్పుడు తాగవచ్చు. లేదా చల్లగా అయ్యాక ఫ్రిజ్‌లో పెట్టి కూడా తాగవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని అందరూ ఇష్టపడతారు.