Carrot Pickle : క్యారెట్.. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. క్యారెట్ ను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కంటి చూపును పెంచడంలో, చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో, బరువు తగ్గడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇలా అనేక రకాలుగా క్యారెట్ మనకు దోహదపడుతుంది. చాలా మంది దీనిని జ్యూస్ గా చేసి తీసుకుంటూ ఉంటారు. అలాగే వంటల్లో వాడుతూ ఉంటారు. వివిధ రకాల వంటల్లో వాడడంతో పాటు క్యారెట్ తో మనం ఎంతో రుచిగా ఉండే నిల్వ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి కమ్మగా, చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతాయని చెప్పవచ్చు. అలాగే ఈ పచ్చడిని 10 నిమిషాల్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ క్యారెట్ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె -అర కప్పు, మెంతులు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 5, ఆవాలు -ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, క్యారెట్ – 200 గ్రా., ఉప్పు – 2 టీ స్పూన్స్, కారం – 2 టేబుల్ స్పూన్స్, వేయించిన ఆవాల పొడి – ఒక టీ స్పూన్, మెంతిపిండి – అర టీ స్పూన్, నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్స్.
క్యారెట్ నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా క్యారెట్ పై ఉండే తొక్కను తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మెంతులు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, పసుపు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో కట్ చేసిన క్యారెట్ ముక్కలను తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి వేసి కలుపుకోవాలి. తరువాత తాళింపును వేసుకోవాలి. చివరగా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని గాజు సీసాలో వేసి రెండు రోజుల పాటు అలాగే ఉంచాలి. పచ్చడి బాగా ఊరిన తరువాత అన్నంతో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్యారెట్ నిల్వ పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడి రెండు నెలల పాటు తాజాగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన క్యారెట్ పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.