Catering Style Gongura Chutney : గోంగూర చట్నీ.. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈ గోంగూర చట్నీ పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. చాలా మందికి ఈ చట్నీని చూడగానే నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. అన్నం, నెయ్యితో కలిపి ఈ చట్నీని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తినడం వల్ల మన శరీరానికి వివిధ రకాల పోషకాలు కూడా లభిస్తాయి. ఈ గోంగూర చట్నీని ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ గోంగూర చట్నీని క్యాటరింగ్ స్టైల్ లో రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాటరింగ్ స్టైల్ గోంగూర చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 8, పచ్చిమిర్చి – 6, వెల్లుల్లి రెబ్బలు – 4, తరిగిన టమాటాలు – 2, ఉప్పు- తగినంత, పసుసు – పావు టీ స్పూన్, గోంగూర కట్టలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), నీళ్లు – అర గ్లాస్, వేయించిన మెంతుల పొడి – పావు టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు పదార్థాలు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, ఇంగువ – చిటికెడు.
క్యాటరింగ్ స్టైల్ గోంగూర చట్నీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత టమాట ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత పసుపు, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు గోంగూరను వేసి 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. గోంగూర కొద్దిగా దగ్గర పడిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి టమాట, గోంగూర మెత్తబడే వరకు చక్కగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత ఈ గోంగూరను జార్ లో వేసుకోవాలి. ఇందులోనే మెంతి పొడి కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు తాళింపుకు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, కమ్మగా ఉండే క్యాటరింగ్ స్టైల్ గోంగూర చట్నీ తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.