Cauliflower Avakaya : క్యాలీప్లవర్ ఆవకాయ.. క్యాలీప్లవర్ తో చేసే ఈ ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది. అన్నం, అల్పాహారాలతో తీసుకోవడానికి ఈ ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ క్యాలీప్లవర్ ఆవకాయ చాలా రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. క్యాలీప్లవర్ ను తినని వారు కూడా ఈ ఆవకాయను ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వంటరాని వారు కూడా ఈ ఆవకాయను తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, సులభంగా చేసుకోగలిగే ఈ క్యాలీప్లవర్ ఆవకాయను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాలీప్లవర్ ఆవకాయ తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యాలీప్లవర్ – పెద్దది ఒకటి, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు – 2 టీ స్పూన్స్, మెంతులు – ఒక టీ స్పూన్, నూనె – ఒక కప్పు, తాళింపు దినుసులు -ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు- 20, ఎండుమిర్చి – 4, కరివేపాకు – రెండు రెమ్మలు, ఉప్పు – పావు కప్పు, కారం – పావు కప్పు, పసుపు – అర టీ స్పూన్, నిమ్మకాయలు – 3 నుండి 4 ( మధ్యస్థంగా ఉన్నవి).
క్యాలీప్లవర్ ఆవకాయ తయారీ విధానం..
ముందుగా క్యాలీప్లవర్ ను కాడలు లేకుండా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో ఉప్పు వేసి నీటిని బాగా మరిగించాలి. నీరు బాగా మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి క్యాలీప్లవర్ ముక్కలను వేసి ఒక నిమిషం పాటు ఉంచాలి. తరువాత వీటిని పూర్తిగా వడకట్టి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఆవాలు, మెంతులు వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక క్యాలీప్లవర్ ముక్కలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై 5 నిమిషాల పాటు వేయించిన తరువాత గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో తాళింపు దినుసులు వేసి వేయించాలి.
తరువాత వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవన్నీ చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తాళింపు చల్లారిన తరువాత ఇందులో వేయించిన క్యాలీప్లవర్ ముక్కలు వేసి కలపాలి. తరువాత ఉప్పు, కారం, మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడి, పసుపు వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత నిమ్మకాయల నుండి రసాన్ని తీసుకోవాలి. తరువాత తగినంత నిమ్మరసం వేసి కలపాలి. ఈ పచ్చడిని గాజు సీసాలో వేసి ఊరబెట్టాలి. తరువాత అంతా కలిసేలా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాలీప్లవర్ ఆవకాయ తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది.