Cauliflower Fry : సాధారణంగా మనం అన్నంతో పప్పు లేదా సాంబార్ వంటి కూరలను తినేటప్పుడు వేపుడు ఉంటే బాగుంటుందని అనుకుంటూ ఉంటాం. అందులో భాగంగానే వడియాలను, చిప్స్‌ను, ఇతర వేపుడు కూరలను అంచున పెట్టుకుని తింటుంటాం. దీంతో భోజనం రుచి భలేగా ఉంటుంది. అయితే కాలిఫ్లవర్‌తో వేపుడు తయారు చేసి దాన్ని అన్నంతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్రమంలోనే కాలిఫ్లవర్ వేపుడును రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాలిఫ్లవర్ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
కాలిఫ్లవర్ పువ్వులు – 20 (చిన్నవి), టమాటాలు – 2, ఉల్లిపాయలు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్లు, ఉప్పు – తగినంత, మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి – 2 టీస్పూన్లు, పసుపు – అర టీస్పూన్, కారం – 2 టీస్పూన్లు, నూనె – వేయించేందుకు సరిపడా.
కాలిఫ్లవర్ వేపుడు తయారీ విధానం..
ముందుగా మిక్సీలో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మెత్తగా పేస్ట్‌లా పట్టుకోవాలి. అనంతరం దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే తగినంత ఉప్పు, కారం, పసుపు, బియ్యం పిండి వేసి కలపాలి. ఇప్పుడు కాలిఫ్లవర్ పువ్వులను వేసి కలిపి అర గంట పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరువాత బయటకు తీసి మొక్కజొన్న పిండి కూడా కలిపి రెండు లేదా మూడు చొప్పున పువ్వుల్ని మరుగుతున్న నూనెలో వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. ఇలా అన్ని పువ్వులను కాల్చితే చాలు.. కాలిఫ్లవర్ వేపుడు తయారవుతుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. భోజనంలో వీటిని కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి.