Cauliflower Rice : మనకు అందుబాటులో ఉన్న కూరగాయల్లో కాలిఫ్లవర్ కూడా ఒకటి. ఇది మనకు ఏడాది పొడవునా లభిస్తుంది. అయితే దీన్ని తినేందుకు చాలా మంది ఆసక్తిని చూపించరు. కానీ కాలిఫ్లవర్ మనకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. దీంట్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక మాంసాహారం తినని వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే కాలిఫ్లవర్‌ను చాలా మంది పలు రకాలుగా వండుతుంటారు. దీంతో రైస్ కూడా తయారు చేయవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాలిఫ్లవర్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు..
కాలీఫ్లవర్ ముక్కలు- 2 కప్పులు, బియ్యం- 2 కప్పులు, కొత్తిమీర- కొద్దిగా, నూనె- 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు – తగినంత, బఠాణీలు – అరకప్పు, పచ్చిమిర్చి – 5, జీలకర్ర – అర టీస్పూను, అల్లం వెల్లుల్లి ప్లేస్ట్ – అర టీస్పూను, పసుపు – చిటికెడు, గరం మసాలా- 1 టీస్పూను.
కాలిఫ్లవర్ రైస్‌ను తయారు చేసే విధానం..
ముందుగా బియ్యాన్ని పొడిపొడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో ఉప్పు, పసుపు వేసి కాలిఫ్లవర్ ముక్కలను 10 నిమిషాలు ఉడికించి ఆరబెట్టుకోవాలి. తర్వాత మరో పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఆరబెట్టుకున్న కాలిఫ్లవర్ ముక్కలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత బాణలిలో నూనె పోసి వేడెక్కాక జీలకర్ర, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, బఠాణీలు వేసి వేగించాలి. తర్వాత కాలిఫ్లవర్ ముక్కలు, అన్నం, గరం మసాలా, ఉప్పు వేసి 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. కాలిఫ్లవర్ రైస్ రెడీ. దీన్ని ఉదయం అల్పాహారం లేదా మధ్యాహ్నం లంచ్‌లో తినవచ్చు. ఉదయం వంట చేసే సమయం లేకపోతే మధ్యాహ్నం బాక్స్ లోకి దీన్ని తయారు చేసుకుని తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.