Chegodilu : మనకు బయట షాపుల్లో లభించే చిరుతిళ్లల్లో చెగోడీలు కూడా ఒకటి. చెగోడీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడతారు. అయితే బయట కొనుగోలు చేసే పని లేకుండా కరకరలాడుతూ రుచిగా ఉండే చెగోడీలను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఒకేసారి ఎక్కవ మొత్తంలో తయారు చేసుకుని వీటిని నిల్వ కూడా చేసుకోవచ్చు. ఇంట్లోనే రుచికరమైన చెగోడీలను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చెగోడీల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – ఒక కప్పు, నీళ్లు – ఒక కప్పు, వాము – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – అర టీ స్పూన్, బటర్ – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, పసుపు – కొద్దిగా.
చెగోడీల తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీటిని తీసుకోవాలి. ఇందులో బియ్యం పిండి తప్ప మిగిలిన పదార్థాల్నీ వేసి వేడి చేయాలి. వీటిని కలుపుతూ నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత మంటను చిన్నగా చేసి బియ్యం పిండి వేసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టాలి. పిండి చల్లారిన తరువాత చేత్తో నలుపుతూ బాగా కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ రోల్స్ లాగా చేసుకోవాలి. ముందుగా సన్నగా పొడువుగా వత్తుకున్న తరువాత చెగోడీలా చుట్టుకోవాలి.
ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చెగోడీలను వేసి మధ్యస్థ మంటపై వేయించాలి. వీటిని అటూ ఇటూ కదుపుతూ కరకరలాడే వరకు వేయించాలి. చెగోడీలపై ఏర్పడిన నూనె అంతా పోయిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చెగోడీలు తయారవుతాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు.