Chicken Ghee Roast : చూడ‌గానే నోరూరించే చికెన్ ఘీ రోస్ట్‌.. త‌యారీ ఇలా..!

Chicken Ghee Roast : చికెన్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని ఇష్టంగా తింటూ ఉంటాం. చికెన్ తో చేసిన వంట‌కాల‌ను చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఇష్టంగా తింటారు. చికెన్ వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్, విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ వంటి పోష‌కాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. రెస్టారెంట్ ల‌లో మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భించే చికెన్ వంట‌కాల్లో చికెన్ ఘీ రోస్ట్ ఒక‌టి. ఈ వంట‌కాన్ని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. తిన్నా కొద్ది తిన్నాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ చికెన్ ఘీ రోస్ట్ ను సుల‌భంగా ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ ఘీ రోస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – అర కిలో, చిలికిన పెరుగు – అర క‌ప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌, నెయ్యి – 6 టేబుల్ స్పూన్స్, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 8, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Chicken Ghee Roast recipe in telugu tastes very better
Chicken Ghee Roast

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 6, యాల‌కులు – 7, మిరియాలు – ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్, సోంపు గింజ‌లు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ధ‌నియాలు – 2 టీ స్పూన్స్, ఎండుమిర్చి – 12 నుండి 15, ప‌త్త‌ర్ ఫూల్ – ఒక టీ స్పూన్, చిన్న ఉల్లిపాయ‌లు – 10 నుండి 12, ఉప్పు – త‌గినంత‌.

చికెన్ ఘీ రోస్ట్ త‌యారీ విధానం..

ముందుగా చికెన్ ను శుభ్రంగా క‌డిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఈ గిన్నెలో చికెన్ మునిగే వ‌ర‌కు నీటిని తీసుకోవాలి. త‌రువాత ఒక టీ స్పూన్ ఉప్పు వేసి చికెన్ ను 5 గంటల పాటు ప‌క్క‌కు ఉంచాలి లేదా ఒక రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచాలి. ఇలా చేసిన త‌రువాత చికెన్ ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఈ చికెన్ లో పెరుగు, ప‌సుపు, అల్లం పేస్ట్, నిమ్మ‌ర‌సం వేసి బాగా క‌లిపి ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో ప‌త్త‌ర్ ఫూల్, ఉల్లిపాయ‌లు, ఉప్పు త‌ప్ప మిగిలిన మ‌సాలా ప‌దార్థాల‌న్నీ వేసి చిన్న మంట‌పై చ‌క్క‌టి వాస‌న వ‌చ్చే వ‌ర‌కు వేయించుకోవాలి. త‌రువాత ప‌త్త‌ర్ ఫూల్ వేసి స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. త‌రువాత వీట‌న్నింటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు, ఉల్లిపాయ‌లు వేసి వీలైనంత మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి.

నెయ్యి వేడ‌య్యాక వెల్లుల్లి రెబ్బలు, ప‌చ్చిమిర్చి, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న చికెన్ ను వేసి క‌ల‌పాలి. దీనిని మ‌ధ్య‌స్థ మంట‌పై త‌డి అంతా పోయి పొడిగా అయ్యే వ‌ర‌కు 15 నుండి 20 నిమిషాల పాటు బాగా వేయించాలి. త‌రువాత ముందుగా త‌యారు చేసుకున్న మ‌సాలా పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల నీళ్ల‌ను వేసి చికెన్ ముక్క చిద‌ర‌కుండా బాగా క‌లుపుకోవాలి. దీనిని అడుగు మాడ‌కుండా 3 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత కొత్తిమీర‌ను చ‌ల్లుకోవాలి. చివ‌ర‌గా మిగిలిన నెయ్యిని వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ ఘీ రోస్ట్ త‌యార‌వుతుంది. దీనిని ప‌ప్పు, సాంబార్, ర‌సం వంటి వాటితో సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఒక్క ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts