Chicken Gravy Curry : చికెన్ ను మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. చికెన్ తో ఎక్కువగా తయారు చేసే వంటకాల్లో చికెన్ గ్రేవీ కర్రీ ఒకటి. దీనిని ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే చికెన్ గ్రేవీ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దేనితో తినడానికైనా ఇది చాలా చక్కగా ఉంటుంది. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. మరింత రుచిగా హోటల్ స్టైల్ లోచికెన్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ గ్రేవీ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన టమాట – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, చికెన్- ముప్పావు కిలో, పసుపు – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – 3 టేబుల్ స్పూన్స్, నీళ్లు – ఒక గ్లాస్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ధనియాలు – 2 టీ స్పూన్స్, ఎండుకొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క, అనాస పువ్వులు – 2, లవంగాలు – 4, యాలకులు – 4, గసగసాలు – అర టీ స్పూన్, మిరియాలు – అర టీ స్పూన్.
చికెన్ గ్రేవీ కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో ధనియాలు, ఎండుకొబ్బరి ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత మిగిలిన మసాలా పదార్థాలు వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత చికెన్ వేసి కలపాలి. చికెన్ ను కలుపుతూ దీనిలో ఉండే నీరంతా పోయే వరకు ఉడికించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కలపాలి. దీనిని ముక్కలకు పట్టేలా బాగా కలుపుకున్న తరువాత నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చికెన్ మెత్తగా ఉడికి దగ్గర పడిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, సంగటి వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన చికెన్ ను కర్రీని అందరూ మరింత ఇష్టంగా తింటారు.