Chicken Handi : మనకు రెస్టారెంట్ లలో లభించే చికెన్ వెరైటీలల్లో చికెన్ హండి కూడా ఒకటి. చికెన్ హండి చాలా రుచిగా ఉంటుంది. రోటీ, నాన్, చపాతీ, బటర్ నాన్ వంటి వాటితో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. ఈ చికెన్ హండిని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వంటరాని వారు, మొదటిసారి చేసే వారు, బ్యాచిలర్స్ ఇలా ఎవరైనా చాలా సులభంగా, చాలా రుచిగా ఈ చికెన్ హండిని తయారు చేసుకోవచ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో లేదా ఏదైనా వెరైటీగా తినాలనిపించినప్పుడు ఇలా చికెన్ హండిని తయారు చేసి తీసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్ చికెన్ హండిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ హండి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టీ స్పూన్, తరిగిన టమాటాలు – 2, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, కాశ్మీరి చిల్లీ కారం – ఒక టేబుల్ స్పూన్, చికెన్ – అరకిలో, ఉప్పు – తగినంత, పెరుగు – 200 గ్రా., చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, కసూరిమెంతి – ఒక టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ – 3 టేబుల్ స్పూన్స్, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
చికెన్ హండి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి వేయించాలి. టమాట ముక్కలు మెత్తగా వేగిన తరువాత పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కాశ్మీరి చిల్లీ కారం వేసి కలపాలి. తరువాత చికెన్, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చకెన్ లోని నీరంతా పోయే వరకు వేయించాలి. తరువాత పెరుగు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి చికెన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.చికెన్ మెత్తగా ఉడికి నూనె పైకి తేలిన తరువాత పచ్చిమిర్చి, కసూరిమెంతి, ప్రెష్ క్రీమ్, గరం మసాలా వేసి కలపాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టాలి. దీనిని చిన్న మంటపై మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ హండి తయారవుతుంది. ఈ విధంగా చాలా సులభంగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ హండిని తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.