Chicken Kofta : ఎప్పుడూ ఒకేరకం చికెన్ కర్రీలను తిని తిని బోర్ కొట్టిందా… వెరైటీగా చికెన్ క్రరీని తినాలనుకుంటున్నారా.. అయితే మీరు ఈ చికెన్ కోఫ్తా కర్రీని రుచి చూడాల్సిందే. తరచూ ఒకేరకం కూరలు కాకుండా మనం చికెన్ తో ఇలా కోఫ్తా కర్రీని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా తేలిక.మొదటిసారి చేసేవారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ కోఫ్తా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ కోఫ్తా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, టమాటాలు – పెద్దవి రెండు.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఫ్రైడ్ ఆనియన్స్ – అర కప్పు, యాలకులు – 3, లవంగాలు – 4, దాల్చిన చెక్క- ఒక ఇంచు ముక్క, మిరియాలు – అర టీ స్పూన్, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి – 2.
కోఫ్తా బాల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్ లెస్ చికెన్ – 200 గ్రా., కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, అల్లం తరుగు -అర టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి రెబ్బలు – 4, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్.
చికెన్ కోఫ్తా కర్రీ తయారీ విధానం..
ముందుగా చికెన్ ను జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో కోఫ్తా బాల్స్ కు కావల్సిన మిగిలిన పదార్థాలు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత వీటిని చిన్న నిమ్మకాయంత బాల్స్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత కోఫ్తా బాల్స్ ను వేసి మూత పెట్టాలి. ఈ బాల్స్ ను మధ్య మధ్యలో తిప్పుతూ పూర్తిగా వేయించుకోవాలి. తరువాత జార్ లో మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తరువాత కారం, జీలకర్ర పొడి, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత పావు కప్పు నీళ్లు పోసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత టమాటాలను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కలపాలి. దీనిని 4 నిమిషాల పాటు వేయించిన తరువాత 150 ఎమ్ ఎల్ నీళ్లు పోసి కలపాలి. తరువాత కోఫ్తా బాల్స్ వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ కోఫ్తా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.