Chicken Nuggets : మనకు బయట రెస్టారెంట్ లలో లభించే చికెన్ వెరైటీలల్లో చికెన్ నగెట్స్ కూడా ఒకటి. అలాగే మనకు సూపర్ మార్కెట్ లలో కూడా ఇన్ స్టాంట్ చికెన్ నగెట్స్ లభిస్తూ ఉంటాయి. చికెన్ నగెట్స్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. పిల్లలు మరింత ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ చికెన్ నగెట్స్ బయట లభించే విధంగా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ చికెన్ నగెట్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ చికెన్ నగెట్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రెడ్ స్లైసెస్ – 3, బోన్ లెస్ చికెన్ – 350 గ్రా., ఉప్పు – తగినంత, మిరియాల పొడి – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – 2 టీ స్పూన్స్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 2, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, కోడిగుడ్లు – 2, మైదాపిండి – అర కప్పు, బ్రెడ్ క్రంబ్స్ – ఒక కప్పు.
క్రిస్పీ చికెన్ నగెట్స్ తయారీ విధానం..
ముందుగా బ్రెడ్ స్లైసెస్ కు ఉండే అంచులను తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇదే జార్ లో చికెన్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, కారం,కార్న్ ఫ్లోర్, సోయాసాస్, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా చికెన్ మిశ్రమాన్ని తీసుకుంటూ నగెట్స్ ఆకారంలో వత్తుకోవాలి. తరువాత ఒక గిన్నెలో కోడిగుడ్లను వేసి బాగా చిలకాలి. అలాగే ఒక ప్లేట్ లో మైదాపిండిని, మరో ప్లేట్ లో బ్రెడ్ క్రంబ్స్ ను తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న చికెన్ నగట్స్ ను ముందుగా మైదాపిండితో కోటింగ్ చేసుకోవాలి.
తరువాత దీనిని కోడిగుడ్డు సొనలో ముంచి తీసి బ్రెడ్ క్రంబ్స్ తో కోటింగ్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చికెన్ నగెట్స్ ను వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్రిస్పీ చికెన్ నగెట్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్, మయోనీస్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇలా బ్రెడ్ క్రంబ్స్ తో కోటింగ్ చేసుకున్న చికెన్ నగెట్స్ ను మనం డీప్ ఫ్రిజ్ లో ఉంచి మనకు కావల్సినప్పుడు ఫ్రై చేసుకుని తినవచ్చు. బయట కొనే పనిలేకుండా ఇలా ఇంట్లోనే చికెన్ నగెట్స్ ను తయారు చేసుకుని తినవచ్చు.