Chicken Vepudu : చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో చికెన్ వేపుడు కూడా ఒకటి. చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఎక్కువగా పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తింటూ ఉంటారు. ఈ చికెన్ వేపుడును రకరకాల పద్దతుల్లో తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా మసాలా పొడి వేసి చేసే ఈ చికెన్ వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. అలాగే ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. మసాలా పొడి వేసి మరింత రుచిగా ఈ చికెన్ వేపుడును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – ముప్పావు కేజీ, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 4 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, పొడవుగా తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన టమాటాలు – 2, కారం – ఒకటిన్నర టేబుల్ స్పూన్ లేదా తగినంత, కసూరి మెంతి – గుప్పెడు, చికెన్ మసాలా – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, యాలకులు – 2, లవంగాలు – 3, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క.
చికెన్ వేపుడు తయారీ విధానం..
ముందుగా కళాయిలో మసాలా పొడికి కావల్సిన దినుసులు వేసి వేయించాలి. వీటిని దోరగా వేయించిన తరువాత జార్ లోకి తీసుకుని పొడిగా చేసుకోవాలి. తరువాత కళాయిలో శుభ్రం చేసుకున్న చికెన్ ను వేసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఈ చికెన్ ను పెద్ద మంటపై నీరంతా పోయే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత మంటను మధ్యస్థంగా చేసుకోవాలి. తరువాత నూనె వేసి కలపాలి. ఇప్పుడు కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తబడే వరకు వేయించిన తరువాత కారం వేసి కలపాలి.
దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, కసూరి మెంతి వేసి కలపాలి. చికెన్ అడుగు మాడినట్టుగా ఉంటే కొద్దిగా నూనెను వేసుకోవాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు వేయించిన తరువాత చికెన్ మసాలా వేసి కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ వేపుడు తయారవుతుంది. దీనిని నేరుగా లేదా సైడ్ డిష్ గా ఎలా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన చికెన్ వేపుడును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.