Chinna Chepala Pulusu : మనం అనేక రకాల చేపలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మనం ఆహారంగా తీసుకునే చేపలల్లో చిన్న చేపలు కూడా ఒకటి. చిన్న చేపలను కూడా చాలా మంది ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. వీటిని తీసుకోవడం వల్ల కూడా మనం శరీరానికి కావల్సిన పోషకాలను పొందవచ్చు. చిన్న చేపలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో చిన్న చేపల పులుసు కూడా ఒకటి. ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. చిన్న చేపలతో మొదటి చేసే వారు కూడా సులభంగా చేసుకునేలా పులుసును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్న చేపల పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్న చేపలు – అరకిలో, తరిగిన పచ్చిమిర్చి – 4, కచ్చా పచ్చాగా దంచిన ఉల్లిపాయలు -3, ధనియాల పొడి- ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి -అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు -తగినంత, తరిగిన టమాటాలు – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టీ స్పూన్, నూనె -ఒకటిన్నర టేబుల్ స్పూన్, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, కారం – 2 టీ స్పూన్స్.
చిన్న చేపల పులుసు తయారీ విధానం..
ముందుగా చేపలను గరుకుగా ఉండే నేలపై వేసి బాగా రుద్దాలి. తరువాత తల, తోక, లోపలి భాగాన్ని తీసేసి శుభ్రంగా కడగాలి. ఇందులో ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి 5 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత మరో 3 నుండి 4 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ పేస్ట్ వేసి రంగు మారే వరకు బాగా వేయించాలి.
తరువాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు వేయించాలి. తరువాత చింతపండు రసం, తగినన్ని నీళ్లు పోసి కలపాలి. తరువాత చేపలు వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. చేపలు మెత్తగా ఉడకగానే కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చిన్న చేపల పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చిన్న చేపలతో రుచికరమైన పులుసును తయారు చేసుకుని తినవచ్చు.