Chinthapandu Charu : చింతపండు చారు.. ఎటువంటి పదార్థాలు వేయకుండా కేవలం చింతపండుతో చేసే ఈ చారు చాలా రుచిగా ఉంటుంది.ఈ చారు నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా ఈ చారును పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా చింతపండు చారును తయారు చేసుకుని చక్కగా భోజనం చేయవచ్చు. చింతపండుతో రుచిగా చారును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చింతపండు చారు తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – రెండు రెమ్మలు, పొడుగ్గా తరిగిన టమాట – 1, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, కరివేపాకు – ఒక రెమ్మ, ధనియాలు – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఎండుమిర్చి – 2.
చింతపండు చారు తయారీ విధానం..
ముందుగా చింతపండు నుండి గుజ్జును తీసుకుని గిన్నెలో వేసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు మిగిలిన పదార్థాలన్నింటని వేసుకోవాలి. తరువాత టమాట ముక్కలు మెత్తగా అయ్యేలా చేత్తో నలుపుకోవాలి. ఇప్పుడు ఈ చారును స్టవ్ మీద ఉంచి రెండు పొంగులు వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని ముందుగా తయారు చేసుకున్న చారులో వేసి కలిపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చింతపండు చారు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడుఇలా చింతపండు చారును తయారు చేసుకుని తినవచ్చు. ఈ చారుతో పొట్ట నిండుగా భోజనం చేస్తారనే చెప్పవచ్చు.