Chinthapandu Pachadi : చింత‌పండుతో ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. చాలా భేషుగ్గా ఉంటుంది..!

Chinthapandu Pachadi : మ‌నం వంటింట్లో చింత‌పండును ఉప‌యోగించి ఎక్కువ‌గా ర‌సం, చారు, సాంబార్, పులుసు కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చింత పండు కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చింత‌పండును త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వ‌ల్ల జీర్ణ క్రియ మెరుగుప‌డుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో చింత‌పండు స‌హాయ‌ప‌డుతుంది. జ‌లుబు, ద‌గ్గు, అస్తమాల‌ను కూడా చింత‌పండు త‌గ్గిస్తుంది. చింత‌పండు గుండె, కాలేయ‌ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో దోహ‌దప‌డుతుంది.

Chinthapandu Pachadi make in this way very tasty
Chinthapandu Pachadi

చ‌ర్మ ఆరోగ్యాన్ని ర‌క్షించ‌డంతోపాటు గాయాల‌ను త్వ‌ర‌గా మానేలా చేయ‌డంలో కూడా చింత‌పండు ఉప‌యోగ‌ప‌డుతుంది. చింత‌పండుతో ర‌సం, పులుసు కూర‌లే కాకుండా ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చింతపండు ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చింత‌పండు ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చింత పండు – 50 గ్రా., ఎండు మిర‌ప కాయ‌లు – 20 , చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – ఒక‌టి, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్‌, ధ‌నియాలు – ఒక టీ స్పూన్‌, శ‌న‌గ ప‌ప్పు – ఒక టీ స్పూన్‌, మిన‌ప గుళ్లు – ఒక టీ స్పూన్‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 6, ఉప్పు – రుచికి స‌రిప‌డా, నూనె – ఒక టేబుల్ స్పూన్‌.

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్‌, ఎండు మిర్చి – 2, జీల‌కర్ర – అర టీ స్పూన్‌, ఆవాలు – ఒక టీ స్పూన్‌, శ‌న‌గ ప‌ప్పు – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెబ్బ‌.

చింతపండు ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా చింత‌పండును శుభ్రంగా క‌డిగిన త‌రువాత త‌గిన‌న్ని నీళ్ల‌ను పోసి నాన‌బెట్టుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేసి కాగాక ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప గుళ్లు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో ఎండు మిర‌ప కాయ‌ల‌ను వేసి వేయించుకోవాలి. తరువాత ఒక జార్ లో వేయించిన ఎండు మిర‌ప కాయ‌ల‌ను, ముందుగా వేయించి పెట్టుకున్న ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప గుళ్లను వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. అదే జార్ లో వెల్లుల్లి రెబ్బ‌లు, రుచికి స‌రిప‌డా ఉప్పు, ముందుగా నాన‌బెట్టుకున్న చింత‌పండును వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌ల‌ను వేసి క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఒక చిన్న క‌ళాయిలో నూనె వేసి కాగాక తాళింపు ప‌దార్థాల‌ను వేసి తాళింపు చేసుకోవాలి. ఈ తాళింపును ముందుగా గిన్నెలోకి తీసి పెట్టుకున్న మిశ్ర‌మంలో వేసి క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చింత‌పండు ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. ఇలా త‌యారు చేసుకున్న చింత‌పండు ప‌చ్చ‌డిని వేడి వేడి అన్నం, నెయ్యి తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఏదైనా రుచిగా, పుల్ల‌గా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా చింత‌పండు ప‌చ్చ‌డిని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. చింతపండును త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల అర్థ‌రైటిస్ వ‌ల్ల క‌లిగే నొప్పులు కూడా త‌గ్గుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts