Chiranjeevi : ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో గత కొద్ది నెలలుగా తీవ్ర దుమారం రేగుతున్న విషయం విదితమే. అయితే చిరంజీవి ఇటీవల పలువురు హీరోలు, దర్శక నిర్మాతలతో కలిసి సీఎం వైఎస్ జగన్ తో సమావేశం అయ్యారు. దీంతో స్పందించిన జగన్ త్వరలోనే కొత్త జీవోను విడుదల చేస్తామని, దీంతో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా సినిమా టిక్కెట్ల ధరలు ఉంటాయని తెలిపారు. అయితే జీవోను విడుదల చేసేందుకు సమయం ఉండడంతో.. ఇప్పుడు మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

సీఎం వైఎస్ జగన్‌తో చిరంజీవి, ఇతర హీరోలు ఆ రోజు సమావేశం అయ్యాక రాత్రి హైదరాబాద్ కు వచ్చారట. ఈ క్రమంలోనే అందరూ చిరంజీవి ఇంట్లో సమావేశం అయినట్లు తెలిసింది. వారందరి ఎదుట చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారట. జగన్‌ను కలిస్తే వెంటనే జీవో విడుదల అవుతుందని భావించామని, జగన్ కూడా అదేవిధంగా తనకు గతంలో హామీ ఇచ్చారని, కానీ తీరా వెళ్లి కలిశాక.. త్వరలో జీవో విడుదల చేస్తామని చెప్పారని.. ఇది తనకు నచ్చలేదని, జగన్ మోసం చేశారని.. చిరంజీవి ఇతర హీరోల ఎదుట వాపోయారట. అయితే వారు ఆయనకు నచ్చజెప్పారట.
సీఎం జగన్ కొన్ని రోజుల తరువాత అయినా సరే జీవో విడుదల చేస్తానని చెప్పారు కదా.. అప్పటి వరకు వేచి చూద్దామని.. ఇక చేసేదేం లేదని వారు చిరంజీవికి నచ్చజెప్పారట. దీంతో మరో వారం రోజుల పాటు వారు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
అయితే చిరంజీవి ఈ సమస్యకు వెంటనే పరిష్కారం లభిస్తుందని భావించారట. జగన్‌ను అందరితోపాటు వెళ్లి కలిస్తే ఆయన వెంటనే కొత్త జీవో విడుదల చేస్తారని, దీంతో త్వరగా సమస్య పరిష్కారం అవుతుందని చిరంజీవి అనుకున్నారట. కానీ అలా జరగలేదు. దీంతో చిరంజీవి విచారం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ జగన్ హామీ ఇచ్చారు కనుక ప్రస్తుతం వేచి చూద్దాం అనే ధోరణిలో టాలీవుడ్ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకో వారం తరువాత ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలపై ఎలాంటి జీవో విడుదల చేస్తుంది, ఆమోదయోగ్యంగా ఉండేలాగే జీవోను తెస్తుందా, దాంతో టాలీవుడ్ సంతృప్తి చెందుతుందా ? అన్న విషయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక అవి తెలియాలంటే ఇంకో వారం, పది రోజుల వరకు వేచి చూడక తప్పదు..!