Chocolate Pancake : చాక్లెట్ ప్యాన్ కేక్.. కోకో పౌడర్ తో చేసే ఈ ప్యాన్ కేక్ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తీసుకోవడానికి , స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ చాక్లెట్ ప్యాన్ కేక్ లను తయారు చేసి తీసుకోవచ్చు. వీటిని తయారు చేసుకోవడం చాలా సులభం. 15 నుండి 20 నిమిషాల్లోనే వీటిని తయారు చేసుకోవచ్చు. చాక్లెట్ ప్యాన్ కేక్స్ ను సులభంగా, రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చాక్లెట్ ప్యాన్ కేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – ఒకటిన్నర కప్పు, పంచదార పొడి – అర కప్పు, మిల్క్ పౌడర్ – ఒక టేబుల్ స్పూన్, కోకో పౌడర్ – ఒక టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ – ఒక టీ స్పూన్, వంటసోడా – అర టీ స్పూన్, బటర్ – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – చిటికెడు, వెనీలా ఎసెన్స్ – ఒక టీ స్పూన్, కాచి చల్లార్చిన పాలు – ఒక కప్పు.
చాక్లెట్ ప్యాన్ కేక్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత పాలు తప్ప మిగిలిన పదార్థాలు వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా పాలు పోసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా అంతా కలిసేలా కలుపుకున్న తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. తరువాత దీనిపై ఒక టీ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత పిండిని తీసుకుని ప్యాన్ కేక్ వేసుకోవాలి. దీనిని రెండు వైపులా మధ్యస్థ మంటపై కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చాక్లెట్ ప్యాన్ కేక్ తయారవుతుంది. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా చాలా సులభంగా చాక్లెట్ ప్యాన్ కేక్ ను తయారు చేసి తీసుకోవచ్చు.