Chum Chum Sweet : చమ్ చమ్ స్వీట్.. పేరు వింతగా ఉన్నా ఇది చాలా రుచిగా ఉంటుంది. స్వీట్ షాపుల్లో ఈ మనకు విరివిరిగా లభ్యమవుతుంది. ఈ చమ్ చమ్ స్వీట్ ను మనం ఇంట్లో కూడా చాలా సలుభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడానికి ఎక్కువగా పదార్థాలు కూడా అవసరం ఉండదు. ఎంతో రుచిగా ఉండే ఈ చమ్ చమ్ స్వీట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చమ్ చమ్ స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కటి పాలు – ఒక లీటర్, బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్స్, బేకింగ్ పౌడర్ – చిటికెడు, పంచదార – ఒక కప్పు, నీళ్లు – 3 కప్పులు, యాలకుల పొడి – కొద్దిగా.
చమ్ చమ్ స్వీట్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పాలను పోసి 5 నిమిషాల పాటు పెద్ద మంటపై కలుపుతూ వేడి చేయాలి. తరువాత ఈ పాలల్లో నిమ్మరసం వేసి పాలు విరిగే వరకు కలుపుతూ ఉండాలి. పాలు విరిగి పన్నీర్ గా మారిన తరువాత దానిని ఒక కాటన్ వస్త్రంలోకి తీసుకోవాలి. తరువాత ఈ పన్నీర్ ను గట్టిగా పిండి అందులో నీరు అంతా పోయేలా చేసుకోవాలి. తరువాత ఈ పన్నీర్ ను రెండు నుండి మూడు సార్లు బాగా కడిగి మరలా నీళ్లు పోయేలా గట్టిగా పిండాలి. ఇలా తయారు చేసుకున్న పన్నీర్ ను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇందులో బొంబాయి రవ్వను, బేకింగ్ పౌడర్ ను వేసి బాగా కలపాలి. ఇప్పుడు తగినంత పన్నీర్ మిశ్రమాన్ని తీసుకుని పొడుగ్గా ఉండే కాలా జామున్ ఆకారంలో వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత ఒక కళాయి లో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి.
పంచదార కరిగిన తరువాత అందులో ముందుగా సిద్దం చేసుకున్న పన్నీర్ ఉండలను వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టి 40 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత పంచదార మిశ్రమం తక్కువగా ఉంటే ఒక కప్పు వేడి నీటిని పోసి 5 నిమిషాల పాటు ఉడికించి , యాలకుల పొడి చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని స్వర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చమ్ చమ్ స్వీట్ తయారవుతుంది. చేసే విధానం రసగుల్లా ఉన్నప్పటికి దీని రుచి, రంగు కొద్దిగా వేరుగా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు ఇలా ఎంతో రుచిగా ఉండే చమ్ చమ్ స్వీట్ ను తయారు చేసుకుని తినవచ్చు.