Coconut Halwa : పచ్చి కొబ్బరిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పచ్చి కొబ్బరి తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో, చర్మాన్ని మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో పచ్చి కొబ్బరి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పచ్చి కొబ్బరిని ఎక్కువగా బెల్లంతో కలిపి తింటారు. బెల్లం కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరి మరియు బెల్లాన్ని కలిపి నేరుగా తినడంతో పాటు వీటితో మనం ఎంతో చక్కటి హల్వాను కూడా తయారు చేసుకోవచ్చు. కేవలం అరగంట వ్యవధిలోనే ఈ హల్వాను రుచిగా మనం తయారు చేసుకోవచ్చు. కొబ్బరి హల్వాను రుచిగా ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్తాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
కొబ్బరి తురుము – 2 కప్పులు, బెల్లం పొడి – ఒక కప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – అర టీ స్పూన్.
కొబ్బరి హల్వా తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో కొబ్బరి తురుము, బెల్లం తురుమును తీసుకోవాలి. తరువాత అందులో కొద్దిగా నీటిని పోసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ మరీ మెత్తగా ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నెయ్య వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పును వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి కలపాలి. దీనిని మధ్యస్థ మంటపై కలుపుతూ ఎర్రగా అయ్యి దగ్గర పడే వరకు కనీసం 20 నిమిషాల పాటు వేయించాలి. కొబ్బరి మిశ్రమం పూర్తిగా దగ్గర పడిన తరువాత యాలకుల పొడి, ఒక టీ స్పూన్ నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి హల్వా తయారవుతుంది. దీనిని వేడిగా, చల్లగా ఎలా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.
ఈ కొబ్బరి హల్వా మూడు నుండి నాలుగు రోజుల పాటు పాడవకుండా తాజాగా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు పచ్చికొబ్బరితో ఇలా రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసే హల్వాను తయారు చేసుకుని తినవచ్చు. ఈ హల్వాను ప్రసాదంగా కూడా ఉపయోగించవచ్చు. పచ్చికొబ్బరితో తరచూ చేసే వంటకాలతో పాటు ఇలా హల్వాను కూడా తయారు చేసుకుని తినవచ్చు.