Coconut Jelly : పచ్చి కొబ్బరి అంటే చాలా మందికి ఇష్టమే. సాధారణంగా దేవుడికి కొబ్బరికా కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని చాలా మంది పలు వంటకాలకు ఉపయోగిస్తారు. ఇక మనం తరచూ పచ్చి కొబ్బరిని ఉపయోగిస్తూనే ఉంటాం. దీన్ని కూరల్లో వేయవచ్చు. దీంతో మసాలా వంటకాలు, తీపి వంటలు చేస్తారు. ఇవన్నీ ఎంతో టేస్టీగా ఉంటాయి. అయితే పచ్చి కొబ్బరితో జెల్లీ తయారు చేయవచ్చని మీకు తెలుసా..? అవును.. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. తయారు చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే పచ్చి కొబ్బరితో జెల్లీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి కొబ్బరి జెల్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
కొబ్బరికాయలు – 2, చక్కెర – ఒకటిన్నర టేబుల్ స్పూన్, అగర్ అగర్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్, కప్స్ – 6.
పచ్చి కొబ్బరి జెల్లీని తయారు చేసే విధానం..
కొబ్బరికాయలను పగలగొట్టి నీళ్లను తీయాలి. నలకలు, కొబ్బరి పలుకులు లేకుండా మరొక గిన్నెలోకి వడకట్టుకోవాలి. దాన్ని పోయ్యి మీద పెట్టి చిన్న మంట మీద ఉంచాలి. తరువాత చక్కెర వేసి కలపాలి. చక్కెర కరిగాక అగర్ అగర్ పౌడర్ వేసి తిప్పాలి. ఒక పొంగు వచ్చే వరకు ఉంచి, దించి పక్కన పెట్టాలి. లేత పచ్చి కొబ్బరికి వెనుక ఉండే పెళుసు భాగాన్ని తీసి, తెల్లగా ఉన్న కొబ్బరిని సన్నగా, పొడవుగా పలుకులుగా కట్ చేసుకోవాలి. దీన్ని అన్ని కప్పుల్లో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. చల్లారిన కొబ్బరినీళ్ల మిశ్రమాన్ని అన్ని కప్పుల్లో పోసుకోవాలి. స్పూన్‌తో ఒకసారి కలపాలి. దాంతో అడుగున్న ఉన్న కొబ్బరి పలుకులు పైకి వస్తాయి. కప్పులన్నీ ఫ్రిజ్‌లో 15 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత బయటకు తీయాలి. అంతే.. కొబ్బరి జెల్లీ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. డీప్ ఫ్రిజ్‌లో పెడితే మరింత త్వరగా ఇది రెడీ అవుతుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.