Coconut Oil At Home : కొబ్బరి నూనె.. ఇది మనందరికి తెలిసిందే. వంటల్లో దీనిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. కొబ్బరి నూనెను వాడడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. మన జుట్టు సంరక్షణలో కూడా కొబ్బరి నూనె ఎంతగానో సహాయపడుతుంది. కొబ్బరి నూనెను వాడడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ చక్కగా పని చేస్తుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండెకు సంబంధించిన వ్యాధులు మన దరి చేరకుండా ఉంటాయి. కొబ్బరి నూనెను వాడడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. బరువు తగ్గడంలో కూడా కొబ్బరి నూనె మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఎముకలను ధృడంగా ఉంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో కొబ్బరి నూనె మనకు ఉపయోగపడుతుంది.
మనం ఎక్కువగా బయట లభించే కొబ్బరి నూనెను కొనుగోలు చేసి వాడుతూ ఉంటాము. అయితే నేటి తరుణంలో కొబ్బరి నూనెను కూడా కల్తీ చేస్తున్నారు. కల్తీ కొబ్బరి నూనెను వాడడం వల్ల మనం అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఈ కొబ్బరి నూనెను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కొబ్బరి నూనెను తయారు చేయడం చాలా సులభం. ఇంట్లోనే కొబ్బరి నూనెను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కొబ్బరి కాయ నుండి కొబ్బరిని తీసుకోవాలి. తరువాత ఈ కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని జార్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు ఈ కొబ్బరి మిశ్రమంలో రెండు కప్పుల నీళ్లు పోసి వాటి నుండి కొబ్బరి పాలను తీసుకోవాలి. మిగిలిన కొబ్బరి పిప్పిలో మరో రెండు కప్పుల నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. దీనిని కూడా జల్లి గిన్నెలో వేసి మరోసారి కొబ్బరి పాలను తీసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలను ఫ్రీజర్ లో 4 నుండి 5 గంటల పాటు ఉంచాలి. ఇలా ఫ్రిజ్ లో ఉంచడం వల్ల పైన కొబ్బరిపాలు గడ్డకడతాయి. అలాగే కింద భాగంలో నీళ్లు గడ్డకడతాయి. ఇప్పుడు పైన గడ్డకట్టిన కొబ్బరి పాలను నెమ్మదిగా వేరు చేసి కళాయిలోకి తీసుకోవాలి. తరువాత వీటిని మధ్యస్థ మంటపై కలుపుతూ వేడి చేయాలి. కొద్ది సమయానికి కొబ్బరి పాలు విరిగి దాని నుండి నూనె రావడం మొదలవుతుంది.
కొబ్బరి కోవా అంతా రంగు మారి నూనె చిక్కబడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దానిని చల్లారనివ్వాలి. తరువాత ఈ కొబ్బరి నూనెను వడకట్టి సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్వచ్ఛమైన కల్తీ లేని కొబ్బరి నూనెను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న కొబ్బరి నూనెను వంటల్లో వాడవచ్చు. అలాగే చర్మం మరియు జుట్టు సంరక్షణ కొరకు కూడా ఉపయోగించవచ్చు.